క్రికెట్ లో అన్న ''దమ్ములు''.. ఒకే రోజు సెంచరీల మోత
క్రికెట్ లో అన్నదమ్ములు ఒక జట్టుకు ఆడడం అరుదు.. స్టీవ్ వా, మార్క్ వా, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ వంటి మేటి ఆటగాళ్లకే అది సాధ్యమైంది
By: Tupaki Desk | 26 Jan 2024 11:09 AM GMTక్రికెట్ లో అన్నదమ్ములు ఒక జట్టుకు ఆడడం అరుదు.. స్టీవ్ వా, మార్క్ వా, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ వంటి మేటి ఆటగాళ్లకే అది సాధ్యమైంది. ఇంకొందరు సోదరులు కూడా జాతీయ జట్లకు ఆడినా వీరిలా ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించలేదు. అయితే, అందరు సోదరులు ఇలానే ఆడాలని కోరుకోవడం సరికాదు. ఎవరి అభిరుచులు వారికుంటాయి. కాగా.. ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్ లో ఓ సోదర ద్వయం సంచలనం రేపుతోంది.
అటు అన్న..
సర్ఫరాజ్ ఖాన్.. భారత క్రికెట్ లో పదేళ్లుగా మార్మోగుతున్న పేరు ఇది. 14 ఏళ్ల కిందట 12 ఏళ్ల వయసులో హారిస్ షీల్డ్ ట్రోఫీలో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున బరిలో దిగి 439 పరుగులు చేశాడు అతడు. ఇందులో 56 ఫోర్లు, 12 సిక్స్ లు ఉండడం గమనార్హం. గొప్ప క్రికెటర్ అవుతాడనుకున్న అతడు మధ్యలో వివాదాల బాట పట్టాడు. ఏజ్ విషయంలో మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముంబై రంజీ జట్టును వీడి ఉత్తరప్రదేశ్ కు వెళ్లాడు. తిరిగి ముంబైకి వచ్చాడు. అండర్ 19 జాతీయ జట్టుకు ఆడుతూ 2014 ప్రపంచ కప్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో బెంగళూరు వంటి జట్లకూ ఆడినా కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. మూడేళ్లుగా మాత్రం మరింత నిలకడ చూపుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి సగటు 62 కావడం విశేషం. ఇటీవలి సంవత్సరాల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ, మిడిలార్డర్ లో ఖాళీ లేకపోవడం, భారీకాయుడైన సర్ఫరాజ్ ఫిట్ నెస్ పై సందేహాలతో చాన్స్ రావడం లేదు. కాగా, సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్ -ఎ) జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ఆ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో గురువారం భారీ సెంచరీ (161; 160 బంతుల్లో 18×4, 5×6) కొట్టాడు.
ఇటు చిన్న తమ్ముడు
సర్ఫరాజ్ ఖాన్ చిన్న తమ్ముడు ముషీర్ ఖాన్. అన్న కేవలం బ్యాట్స్ మన్ మాత్రమే కాగా.. ముషీర్ స్పిన్ కూడా వేస్తాడు. ఆఫ్ స్పిన్ తో ఆకట్టుకునే ముషీర్.. ఇప్పుడు అండర్ 19 ప్రపంచ కప్ లో ఆడుతున్నాడు. గురువారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ముషీర్ ఖాన్ (118; 106 బంతుల్లో 9×4, 4×6) సెంచరీ బాదాడు. దీంతో భారత్ 301 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ప్రత్యర్థిని 100 పరుగులకే ఆలౌట్ చేసింది. వరుసగా రెండో విజయం సాధించింది. సొంత అన్నదమ్ములు.. ఒకే రోజు సెంచరీలు సాధించడం ఎంతైనా అరుదే. మరి.. సర్పరాజ్, ముషీర్ లో ఎవరు జాతీయ జట్టులోకి వస్తారో చూద్దాం..?