తండ్రికి మించిన తనయుడు కాబోతున్నాడా? అతడి ఊచకోత రేంజ్ తెలిస్తే?
కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్.
By: Tupaki Desk | 22 Nov 2024 4:27 AM GMTమన దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో తమదైన ముద్ర వేసిన వారికి కొదవ లేదు. అయినప్పటికీ కొందరు ఆటగాళ్ల పేర్లు చెప్పినంతనే.. జనరేషన్లతో సంబంధం లేకుండా సదరు ఆటగాడి ఆటకు ఫిదా అయ్యేటోళ్లు కోట్లల్లోనే ఉంటారు. ఆ కోవలోకే వస్తాడు వీరేంద్ర సెహ్వాగ్. బ్యాట్ పట్టుకొని పిచ్ లోకి ఎంట్రీ ఇచ్చాడా? క్రీజ్ లో ఉన్నంతవరకు బౌలర్లు వేసే బంతుల్ని కఠినంగా శిక్షిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు తీయించే అతడి స్టైల్ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లకు తన బ్యాట్ తో చుక్కలు చూపే సెహ్వాగ్ ఆట నుంచి రిటైర్ అయినప్పటికీ.. అతడి దూకుడ్ని ఇప్పటివరకు మర్చిపోయింది లేదు.
ఇప్పుడు ఆ లోటును తీరుస్తూ.. ఎంట్రీ ఇచ్చేశాడు అతడి కొడుకు. ఎంట్రీ మ్యాచ్ తోనే పరుగుల వరద పారించిన అతడు.. ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసి వార్తల్లో నిలిచారు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బ్యాట్ తో బలంగా సమాధానం ఇచ్చిన ఇతగాడి దెబ్బకు స్కోర్ బోర్డులు పరుగులు తీసింది.
మొదటి పరుగును ఎంత దూకుడుగా తీశాడో.. అంతే దూకుడుగా ఫిఫ్టీ.. సెంచరీ.. ఇలా మైల్ స్టోన్స్ ను అలవోకగా దాటేసిన ఇతడు.. మొదటి మ్యాచ్ లోనూ డబుల్ సెంచరీని చేసేశాడు. ప్రత్యర్థి మేఘాలయ జట్టుకు చుక్కలు చూపించిన ఇతడు తాను ఎదుర్కొన్న 229 బంతులకు 200 పరుగులు చేయటంతో.. ఢిల్లీ జట్టు భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఆర్యవీర్ చేసిన డబుల్ సెంచరీలో రెండు సిక్సర్లు.. 34 బౌండరీలు ఉండటం గమనార్హం.
అంటే.. ఫోర్లు.. సిక్సులతో అతడు 148 పరుగులు చేసిన ఆర్యవీర్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఢిల్లీ జట్టు 2 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. మరోవైపు మేఘాలయను కేవలం 260 పరుగులకే ఢిల్లీ జట్టు కట్టడి చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసకర బ్యాటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తండ్రి మాదిరి ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో చెలరేగే సెహ్వాగ్ దూకుడును ఆయన కొడుకు కూడా కొనసాగిస్తారా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. తొలి మ్యాచ్ లో ప్రదర్శించిన దూకుడును కంటిన్యూ చేస్తే.. టీమిండియాలో చోటు దక్కించుకోవటానికి ఎక్కువ కాలం పట్టదనే చెప్పాలి.