Begin typing your search above and press return to search.

షహబాజ్ మాయ... ఫైనల్స్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్!

ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది

By:  Tupaki Desk   |   25 May 2024 4:25 AM GMT
షహబాజ్ మాయ... ఫైనల్స్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్!
X

జెర్సీ మారింది.. కెప్టెన్ మారాడు.. జట్టు మారింది.. తదనుగుణంగా ఫలితాలు కూడా మారాలి.. ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి జరిగిన చర్చ ఇది. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ సమిష్టిగా రాణించడంతో ఫైనల్స్ కు దూసుకెళ్లింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రధానంగా చెప్పుకొవాల్సింది సన్ రైజర్స్ బ్యాటర్స్ గురించి. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించడంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకోగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 287 పరుగులు చేయడంతో ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారారు.

అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం బౌలర్లు కీలక భూమిక పోషించడం గమనార్హం. క్వాలిఫయర్‌ 2లో రాజస్థాన్‌ ను 36 పరుగుల తేడాతో ఓడించిన సన్ రైజర్స్.. ఫైనల్లో అడుగుపెట్టిందంటే ఈ మ్యాచ్ లో బౌలర్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పైగా కెప్టెన్ కూడా బౌలర్ కావడంతో.. తన సహచరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.

అవును... చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (50: 34 బంతుల్లో 4 సిక్స్‌ లు) అర్ధశతకం చేయగా.. రాహుల్ త్రిపాఠి (37: 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ లు) మెరుపులు మెరిపించగా.. ట్రావిస్ హెడ్ (34: 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆరంభంలో కాస్త అదరగొడుతున్నట్లే కనిపించినా.. సన్ రైజర్స్ బౌలర్స్ దాటికి టాప్ & మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ పేకమేడలా కూలిన పరిస్థితి!

రాజస్థాన్ బ్యాటర్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (42: 21 బంతులలో 4 ఫోర్లు, 3 సిక్స్‌ లు) దూకుడుగా ఆడినప్పటికీ హైదరాబాద్‌ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ పై పట్టుబిగించారు. అనంతరం గ్యాప్ ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడంతో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ సమయంలో... ధ్రువ్ జురెల్ (56*: 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ లు) పోరాడినా ఫలితం దక్కలేదు. ధ్రువ్ జురెల్ కూడా రాణించకపోయి ఉంటే పరిస్థితి మరింత దయణీయంగా ఉండేదనే చెప్పాలి. ఇలా లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా... హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్స్ కు దూసుకుపోయింది.

సన్ రైజర్స్ బౌలర్స్ లో షహబాజ్ అహ్మద్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా.. అభిషేక్ శర్మ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇదే సమయంలో పాట్ కమిన్స్, నటరాజన్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.

దీంతో... ఆదివారం (మే - 26)న జరగనున్న ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై లోని చినస్వామి స్టేడియంలో తలపడనుంది.