Begin typing your search above and press return to search.

ఎంపీ పదవి పోయినా ఈ స్టార్‌ క్రికెటర్‌ లక్కీయే!

బంగ్లాదేశ్‌ లో చెలరేగిన రిజర్వేషన్ల చిచ్చుతో ప్రధానమంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Aug 2024 11:30 PM GMT
ఎంపీ పదవి పోయినా ఈ స్టార్‌ క్రికెటర్‌ లక్కీయే!
X

బంగ్లాదేశ్‌ లో చెలరేగిన రిజర్వేషన్ల చిచ్చుతో ప్రధానమంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె దేశాన్ని కూడా విడిచి వెళ్లిపోయారు. మరోవైపు షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ నేతలు, ఇళ్లు, వారి ఆస్తులపై నిరసనకారులు దాడులు చేస్తూనే ఉన్నారు.

మరోవైపు ప్రధానమంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో ఆ దేశ సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం రద్దు కావడంతో ప్రభుత్వంలో ఉన్న అవామీ లీగ్‌ నేతలు తమ పదవులను కోల్పోయారు. వీరిలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ మూలస్తంభం, ప్రముఖ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ కూడా ఉన్నారు. ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు.

ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ ఆల్‌ రౌండర్లలో ఒకరిగా షకీబుల్‌ హసన్‌ తన పేరిట బ్యాటింగ్, బౌలింగ్‌ రికార్డులను లిఖించుకున్నాడు. చాలా కాలంపాటు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ టీమ్‌ కు ప్రాతినిధ్యం వహించిన అతడు ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు.

షకీబుల్‌ హసన్‌ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అతడి క్రికెట్‌ కెరీర్‌ పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అవామీ లీగ్‌ పార్టీకి చెందినవారిని అణిచివేస్తారనే వార్తల నేపథ్యంలో షకీబ్‌ కు ఇక కష్టకాలమేనని వార్తలు వచ్చాయి.

అయితే షకీబుల్‌ హసన్‌ బంగ్లా జాతీయ జట్టులోకి రావడానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అతడు పాకిస్థాన్‌ తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌ లో బంగ్లా తరఫున బరిలోకి దిగనున్నాడు.

మాజీ ప్రధాని షేక్‌ హసీనా, అవామీ లీగ్‌ తో సంబంధాలున్నప్పటికీ అతడిని జట్టులోకి తీసుకునేందుకు తాత్కాలిక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల శాఖ మంత్రి ఆసిఫ్‌ మహమూద్‌.. షకీబుల్‌ హసన్‌ ను అనుమతించినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

ఆటలకు రాజకీయాలతో ముడిపెట్టకూడదనే ఉద్దేశంతోనే షకీబుల్‌ హసన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు బంగ్లా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఉత్తమ జట్టును ఎంపిక చేయడమే బంగ్లా క్రికెట్‌ బోర్డు లక్ష్యమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే షకీబుల్‌ హసన్‌ కు చాన్సు ఇచ్చినట్టు పేర్కొంది. ఉత్తమ ఆటగాళ్లతో జట్టును కూర్చడమే ప్రాధాన్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

బంగ్లా టెస్టు జట్టుకు ఎంపికవ్వడంతో షకీబుల్‌ హసన్‌ ఇతర సభ్యులతో కలిసి పాకిస్థాన్‌ వెళ్లాడు. లాహోర్‌ లో జరిగే తొలి టెస్టులో అతడు పాల్గొంటాడు. బంగ్లాదేశ్‌ లో నెలకొన్న అస్థిర పరిస్థితులతో షకీబ్‌ ప్రస్తుతం కెనడాలో తలదాచుకున్నాడు. అక్కడి నుంచే నేరుగా లాహోర్‌ కు వెళ్లి తన దేశ జట్టుతో చేరాడు.