షమీ రంజాన్ ఉపవాసంపై వివాదం.. రోజా సాధ్యమేనా? సమంజసమేనా?
ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ బ్రేక్ సమయంలో షమీ నీళ్లు , ఎనర్జీ డ్రింక్ తాగడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 4:10 PM ISTటీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కు ఒక్క అడుగుదూరంలో ఉంది. 12 ఏళ్ల తర్వాత చాంపియన్ గా నిలిచే అవకాశం దక్కింది.. ఆదివారం న్యూజిలాండ్ తో మ్యాచ్.. దీంట్లో నెగ్గితే ఇటీవల న్యూజిలాండ్ జట్టు చేతిలో స్వదేశంలో ఎదురైన మూడు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ పరాభవాన్ని మరిపించేందుకు ఇదే సరైన అవకాశం. అయితే, ఇలాంటి సమయంలో సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీపై వివాదం రేగింది.
ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ బ్రేక్ సమయంలో షమీ నీళ్లు , ఎనర్జీ డ్రింక్ తాగడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం (రోజా) పాటించకుండా షమీ తప్పు చేస్తున్నాడంటూ జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ విమర్శించారు. అతడు పెద్ద పాపం చేశాడని.. అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు.
రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్ లో ఉందని, ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ నీళ్లు , ఎనర్జీ డ్రింక్ తాగడంపైనా కొన్ని ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి.
ఆరోగ్యంగా ఉండి.. ‘రోజా’ పాటించకపోవడం తప్పుడు సందేశం పంపుతుందని రిజ్వీ చెప్పారు. అయితే, రిజ్వీ, ముస్లిం సంఘాల ఆగ్రహంపై షమీ కుటుంబం స్పందించింది. భారత్ ఓటమిని కోరకునేవాళ్లే ఇలా మాట్లాడతారని షమీ మండిపడ్డారు.
చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో షమీ 10 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చివర్లో ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. అయితే, మ్యాచ్ సందర్భంగాఅతడు ఎనర్జీ డ్రింక్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల పోస్టులు పెడుతున్నారు. షమీ ఉపవాసం చేయకపోవడం పెద్ద నేరమేమీ కాదని, దేశం అన్నికంటే గొప్పది అని మద్దతు పలుకుతున్నారు.
కాగా, టీమ్ ఇండియా మ్యాచ్ లు జరుగుతున్నది అత్యంత వేడి వాతావరణంలో ఉండే దుబాయ్ లో. పైగా 50 ఓవర్ల వన్డే ఫార్మాట్ లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. పైగా షమీ ప్రధాన పేస్ బౌలర్. 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసేవాడు. అన్నిటికీ మించి మరో కీలక పేసర్ బుమ్రా లేడు. సిరాజ్ ను తీసుకోలేదు. అంటే షమీనే మ్యాచ్ భారం అంతా మోయాలి. అతడు గనుక విఫలమైతే జట్టుకు కష్టాలు తప్పవు. కాబట్టి షమీని కొన్నిటికి అతీతంగా చూడాలని మరికొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.