Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా స్టార్ పేసర్ తిరిగొచ్చాడు.. తమ్ముడితో కలిసి ఆడాడు

ఒక్క ఫైనల్ మ్యాచ్ లో తప్ప మిగతా అన్నిట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 4:30 PM GMT
టీమ్ ఇండియా స్టార్ పేసర్ తిరిగొచ్చాడు.. తమ్ముడితో కలిసి ఆడాడు
X

సరిగ్గా ఏడాది కిందటి వరకు అతడి పేరు దేశంలో మార్మోగింది.. అప్పుడు సొంత గడ్డపై భారత్ వన్డే ప్రపంచ కప్ ఆడుతోంది. కొంచెం ఆలస్యంగా బరిలో దిగిన అతడు మ్యాచ్ మ్యాచ్ కు దుమ్మురేపాడు. బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి భరతం పట్టాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ లో తప్ప మిగతా అన్నిట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో అతడి పేరును తలచుకుంటూ దేశం ఊగిపోయింది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి అతడిని ఓదార్చారు. దీన్నిబట్టే.. అతడు ఎంతటి ప్రతిభ చూపాడో తెలిసిపోతుంది.

బ్యాడ్ లక్ వెంటాడి..

పైన చెప్పుకొన్నదంతా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గురించి. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ లో షమీని తొలుత తుది జట్టులో ఆడించలేదు. అతడి బదులు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. కానీ, ఠాకూర్ విఫలం కావడంతో షమీకి చోటిచ్చారు. ఇదే అవకాశంగా షమీ చెలరేగాడు. ఏడు మ్యాచ్ లలో 24 వికెట్లు తీశాడు. భారత్ వంటి దేశంలో స్పిన్ పిచ్ లపై షమీ చేసినది మామూలు ప్రదర్శన కాదు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి హడలెత్తించాడు. కాగా, షమీ ఇదే ఊపులో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కూడా గెలిపిస్తాడని ఊహిస్తే ఒక్క వికెట్టే తీయగలిగాడు. ఇక ఆ తర్వాత అతడి మోకాలి గాయం తిరగబెట్టింది.

ఏడాది అనంతరం

షమీ గత ఏడాది నవంబరు 19న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడాడు. గాయంతో అప్పటి నుంచి మైదానంలోకి దిగనేలేదు. సర్జరీల అనంతరం ఉత్తరప్రదేశ్ లోని సొంత ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్ లో సాధారణ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. కాగా, షమీని కాస్త కోలుకున్నాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపారు. కొన్నాళ్ల కిందటే కోలుకున్నాడని.. ఆస్ట్రేలియా టూర్ కు పంపుతారని భావించినా సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అయితే, పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడంతో తాజాగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు.

తమ్ముడితో కలిసి

రంజీల్లో పశ్చిమ బెంగాల్ తరఫున ఆడే 34 ఏళ్ల షమీ.. బుధవారం నుంచి మధ్యప్రదేశ్ తో మొదలైన రంజీ మ్యాచ్ లో పాల్గొన్నాడు. విశేషం ఏమంటే.. అతడు ఈ మ్యాచ్ లో తన తమ్ముడు, 27 ఏళ్ల మొహమ్మద్ కైఫ్ తో కలిసి ఆడడం. ఇంకో విశేషం ఏమంటే కైఫ్ కూడా షమీ లాగానే పేస్ బౌలర్. వీరు బ్యాటింగ్ లో 10, 11 స్థానాల్లో కలిసి ఆడారు. అంతేకాదు.. ఇద్దరూ కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేశారు. అయితే, కైఫ్ ఒక వికెట్ పడగొట్టగా.. షమీ మాత్రం 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేదు.