Begin typing your search above and press return to search.

ఈ ‘‘లాలా’’.. టీమిండియా బీమ్లా.. కష్టాల కొలిమిలో రాటుదేలిన పేసర్

టీమిండియాలో అతడి ముద్దు పేరు ‘‘లాలా’’.. డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ అతడిని అలానే పిలుస్తారు మరి.. ఇక మైదానంలో దిగాడంటే మాత్రం బంతితో చెలరేగిపోతుంటాడు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 11:30 AM GMT
ఈ ‘‘లాలా’’.. టీమిండియా బీమ్లా.. కష్టాల కొలిమిలో రాటుదేలిన పేసర్
X

టీమిండియాలో అతడి ముద్దు పేరు ‘‘లాలా’’.. డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ అతడిని అలానే పిలుస్తారు మరి.. ఇక మైదానంలో దిగాడంటే మాత్రం బంతితో చెలరేగిపోతుంటాడు. చక్కటి రనప్.. పదునైన బంతులు.. అందుకుతగ్గ వేగం.. మంచి ఫిట్ నెస్.. అతడి సొంతం.. అవకాశాలు చేజారినా కుంగిపోకపోవడం తన నైజం.. సమస్యలు ఎదురైనప్పుడు నిబ్బరంగా నిలవడం తన స్వభావం.. అందుకేనేమే.. జట్ట సభ్యులు ‘‘లాలా’’ అంటూ అతడిని ఆప్యాయంగా పిలుస్తాంటారు.

షం‘‘షేర్

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ఈ ప్రపంచ కప్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తున్నాడో అందరూ చూస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ కప్ లో షమీ తుది జట్టులో ఉంటాడని ఎవరూ అనుకోలేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం కావడం, మరో పేసర్ హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ కాస్త ఇబ్బంది పడుతుండడంతో షమీని తీసుకున్నారు. దీనికితగ్గట్లే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ లో షమి బంతులను చూసినవారు ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆ మ్యాచ్ లో షమి బౌలింగ్ లో మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎంతగా ఇబ్బంది పడ్డాడో అందరూ చూసిందే. చివరకు ఓ అద్భుత ఇన్ స్వింగర్ ద్వారా షమి అతడిని బౌల్డ్ చేసిన తీరు అద్భుతం.

లేటుగా వచ్చినా.. లేటెస్టుగా..

ప్రపంచ కప్ లో షమీని తొలి నాలుగు మ్యాచ్ లు ఆడించ లేదు. దీనికి కారణం.. జట్టు కూర్పు. మూడో పేసర్ గా షమీని తీసుకుంటే బ్యాటింగ్ బలహీనపడుతుందని భావించారు. అందులోనూ హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ ఉండడం, సిరాజ్ సూపర్ ఫామ్ లో ఉండడంతో షమీని తప్పక పక్కనపెట్టాల్సి వచ్చింది. కానీ, హార్దిక్ గాయం, మరో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైఫల్యం షమీకి కలిసొచ్చింది. ఇఒక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే.. షమీని ఆడించడం టీమిండియాకు కలిసొచ్చింది. లేదంటే న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి జట్ల చేతిలో ఓడిపోయినా ఆశ్చర్యం లేకపోయేది.

భార్యతో విభేదాలు.. కెరీర్ వైఫల్యం

2013లో కెరీర్ ప్రారంభించిన షమీ మొదటి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. ఆ ఏడాది నవంబరులో వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులోనే 9 (4+5) వికెట్లు పడగొట్టి భేష్ అనిపించాడు. పాకిస్థాన్ తో అంతకుముందు జనవరిలో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసి 9 ఓవర్లకు గాను నాలుగు మెయిడెన్లు వేశాడు. 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా, ఇలాగే కెరీర్ సాగితే షమీ ఇప్పుడు ఎక్కడో ఉండేవాడు. కానీ, అనుకోని విధంగా వెనుకబడ్డాడు. ప్రేమించి పెళ్లాడిన ఇషాన్ జహాన్ తో విభేదాలు వచ్చాయి. దీంతో 2017-18 కాలంలో గృహ హింస కేసులు ఎదుర్కొన్నాడు. నిక్కచ్చిగా ఉండే అతడిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు. ఓసారి రోడ్డు ప్రమాదానికీ గురయ్యాడు.

గోడకు కొట్టిన బంతిలా లేచాడు..

2018లో షమీ కెరీర్ కుదుపునకు లోనైంది. నాడు బీసీసీఐ కాంట్రాక్ట్‌ నిలిచిపోయింది. దీంతో ఓ ఇంటర్వ్యూలో బోరున లపించాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయటపడ్డా.. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రిటైన్ చేసుకోలేదు. అయినా,బలంగా నిలిచిన షమీ.. ఇప్పడు మనముందు చాంపియన్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్న ఏడాది (2019)లోనే 21 వన్డేల్లో 177.2 ఓవర్లు వేసి.. 42 వికెట్లు సాధించడం అతడి మనో నిబ్బరానికి నిదర్శనం. అయినా, టీమిండియా చారిత్రక విజయం సాధించి 2020లో ఆస్ట్రేలియా సిరీస్‌ లో షమీకి చోటుదక్కలేదు. మరో ఏడాది పాటు అతడికి పిలుపు కూడా రాలేదు. దీంతో యూపీలో అమ్రోహ గ్రామీణ ప్రాంతంలోని తన ఫామ్‌ హౌస్‌ లో మైదానం ఏర్పాటు చేసుకుని సాధన చేశాడు. ఇక్కడి పిచ్‌ పనులను స్వయంగా షమీ, తన సోదరుడు మహమ్మద్‌ కైఫ్‌తో కలిసి చేసుకున్నాడు. మూడు రకాల పిచ్ లు, ఫ్లడ్‌ లైట్లు, అండర్‌-19, అండర్‌-23 లో ప్రతిభ చాటి బ్యాటర్లను పిలిచి వారితో సాధన ద్వారా షమీ రాటుదేలాడు. కాళ్ల పటుత్వం కోసం పొలాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్ నెస్ సాధించాడు.

గుజరాత్ ను చాంపియన్ గా నిలిపి..

2022 సీజన్ లో ఐపీఎల్ జట్టు గుజరాత్‌ టైటాన్స్ చాంపియన్ గా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఏడాది కూడా ఆ జట్టు తరఫున అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఇక 2023లో 14 వన్డే లలో 28 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రపంచ కప్‌ లో రెండు మ్యాచ్‌లలో 9 వికెట్లు సాధించాడు. వీటిల్లో ఆరు క్లీన్‌ బౌల్డ్‌లే. కాగా,33 ఏళ్ల షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 96 వన్డేల్లో 180 వికెట్లు, 23 టి20ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. మరో మూడేళ్లు ఆడగల సత్తా అతడి సొంతం. ఈ లెక్కన కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో 500 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు.

కొసమెరుపు: షమీ ఇప్పటివరకు 96 వన్డేలు ఆడాడు. ప్రపంచ కప్ సెమీస్ తో వందో వన్డేను పూర్తిచేసుకోనున్నాడు. ఆపై ఫైనల్ కూ చేరితే 101వ వన్డే కానుంది. అతడు ఫామ్ ను కొనసాగిస్తూ, దేశానికి ప్రపంచ కప్ అందించాలని అభిమానులుగా బలంగా కోరుకుందాం.