Begin typing your search above and press return to search.

మహ్మద్ షమీ మాటల స్వింగ్స్... పాక్ మాజీపై సెటైర్ల యార్కర్లు!

ఈ వరల్డ్ కప్ లో అత్యంత పేళవమైన ప్రదర్శన కనబరిచిన జట్లలో పాకిస్థాన్ ఒకటనే విషయం జీర్ణించుకోలేని పాక్ కు చెందిన కొంతమంది మాజీ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 6:57 AM GMT
మహ్మద్  షమీ మాటల స్వింగ్స్... పాక్ మాజీపై సెటైర్ల యార్కర్లు!
X

పాకిస్థాన్ టీం ఓడినప్పటికంటే ఇండియా గెలిచినప్పుడే ఆ దేశంలోని కొందరు మాజీ ఆటగాళ్లు, పలువురు అభిమానులు ఎక్కువ బాదపడతారేమో అనిపిస్తుంటుంది. ఈ వరల్డ్ కప్ లో అత్యంత పేళవమైన ప్రదర్శన కనబరిచిన జట్లలో పాకిస్థాన్ ఒకటనే విషయం జీర్ణించుకోలేని పాక్ కు చెందిన కొంతమంది మాజీ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరీదారుణంగా... ఇంగితం మరిచిన విమర్శలు చేస్తున్నారు!

అవును... ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ లో టీం ఇండియా పెర్ఫార్మెన్స్ చూసి పాక్ లోని కొందరు మాజీలు, సినీ నటీమణులు, అభిమానులూ జీర్ణించుకోలేకపోతున్నారు! పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు తమ అక్కసును... ఫైనల్ లో ఓడిన తర్వాత తమ అన్నందాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ సమయంలో పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా.. టీం ఇండియా బౌలర్లపై చేసిన వ్యాఖ్యలపై మహ్మద్ షమీ ఇచ్చిపడేశాడు.

టీం ఇండియా డిఫరెంట్ బంతులను ఉపయోగించిందని.. అవి బాగా స్వింగ్ అయ్యాయని.. దీంతో మరింత ప్రయోజనం పొందిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల ఆరోపించాడు. మిగిలిన టీం లకు ఐసీసీ బంతులు వాడుతుంటే... టీం ఇండియా మాత్రం బీసీసీఐ బంతులను ఉపయోగిస్తుందన్న స్థాయిలో నోరు జారాడు. దీంతో... తాజాగా ఈ విషయంపై భారత పేసర్ మహ్మద్‌ షమీ స్పందించాడు.

ఇందులో భాగంగా... హసన్ రజా వ్యాఖ్యలు విని తాను ఆశ్చర్యపోయానని తెలిపిన షమీ... అసలు అతడు అంతర్జాతీయ క్రికెట్‌ లో ఎలా భాగమయ్యాడో ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇదే క్రమంలో... తాను ఈ వరల్డ్ కప్ లో మొదట జరిగిన మ్యాచ్‌ ల్లో ఆడనప్పుడు కూడా ఈ ఆరోపణలను విన్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తన తొలి మ్యాచ్‌ లో 5 వికెట్లు తీసిన విషయాన్ని గుర్తు చేశాడు షమీ.

తొలిమ్యాచ్ లో ఐదు.. నెక్స్ట్ మ్యాచ్‌ లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్‌ లో 5 వికెట్లు పడగొట్టడం.. కొందరు పాక్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు అని షమీ అభిప్రాయపడ్డాడు. సరైన సమయంలో రాణించే ఆటగాళ్లే అత్యుత్తమమని తాను భావిస్తున్నానని.. కానీ, మీరు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడు. ఇదే సమయంలో ఈ విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో వసీమ్‌ అక్రం దీని గురించి వివరించాడని గుర్తుచేశాడు.

ఫైనల్ గా హసన్ రజా చేసిన వ్యాఖ్యలపై తనదైన కన్ క్లూజన్ ఇచ్చిన షమీ... ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకోవడం తప్ప ఇంకేమైనా చేస్తారని తాను అనుకోవడం లేదని అన్నాడు.

కాగా... తాజాగా ముగిసిని వరల్డ్ కప్ లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ... అన్ని మ్యాచ్ లూ ఆడినవారికంటే అత్యధిక వికెట్లు తీయడం గమనార్హం. దీంతో ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతడు ఏడు మ్యాచ్‌ ల్లోనే 23 వికెట్లు పడగొట్టగా... అందులో మూడుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. దీంతో... పాక్ మాజీలు కొంతమంది షమీ పై పడి ఏడుస్తున్నారు!!