Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా క్రికెటర్ 102.. ఇది స్కోరు కాదు.. జ్వరం

టీమ్ ఇండియా క్రికెటర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా సరే బ్యాటింగ్ కొనసాగించి ఆస్పత్రి పాలయ్యాడు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 6:36 AM GMT
టీమ్ ఇండియా క్రికెటర్ 102.. ఇది స్కోరు కాదు.. జ్వరం
X

టీమ్ ఇండియా క్రికెటర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా సరే బ్యాటింగ్ కొనసాగించి ఆస్పత్రి పాలయ్యాడు. ఇదంతా ఓ మ్యాచ్ సందర్భంగా జరిగింది. రంజీ చాంపియన్ ముంబై.. దేశంలోని మిగతా అత్యుత్తమ దేశవాళీ క్రికెటర్ల జట్టు రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో చోటుచేసుకుంది. దీంతో అతడు మ్యాచ్ మూడో రోజు మైదానంలోకి దిగే పరిస్థితి లేకపోయింది. మిగతా మ్యాచ్ కూ దూరమైనట్లే. ఇంతకూ ఏం జరిగిందంటే..?

రంజీ డిఫెండింగ్ చాంపియన్ వర్సెస్

దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ ప్రత్యేకమైనది. ఆ ఏడాది రంజీట్రోఫీ చాంపియన్ జట్టు దేశంలోని మిగతా టాప్ ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియా జట్టుతో తలపడుతుంది. ప్రస్తుతం రంజీ చాంపియన్ ముంబై.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇరానీ కప్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై తరఫున బరిలో దిగిన సీనియర్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతూనే బ్యాటింగ్‌ చేసిన అతడిని మ్యాచ్ అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.

మొదటి రోజే అనారోగ్యం..

ఇరానీ కప్‌ మ్యాచ్ లో శార్దూల్ మొదటి రోజే అనారోగ్యంతో కనిపించాడు. కానీ.. రెండో రోజు బుధవారం అలాగే బ్యాటింగ్‌ కు దిగాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్‌ ఖాన్‌ తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ కమ్రంలో శార్దూల్‌ 36 పరుగులు చేశాడు. 59 బంతులు ఆడిన అతడు నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే అప్పటికే అతడి జ్వరం 102 డిగ్రీలకు చేరింది. అయినా జట్టుకు భారీ స్కోరు అందించేందుకు బ్యాటింగ్‌ కు దిగాడు. ఔటైన అనంతరం జ్వరం మరింత పెరగడంతో ముంబయి జట్టు మేనేజ్‌ మెంట్‌ శార్దూల్ ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది.

మలేరియానా? డెంగీనా?

శార్దూల్‌ ను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. అతడికి మలేరియా, డెంగీ సోకిందా? అనే అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలు వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు. శార్దూల్ గురువారం మూడో రోజు బరిలో దిగడం కష్టమే. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 138 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ అజేయంగా డబుల్ సెంచరీ (221) చేశాడు. ఇరానీ కప్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మొదటి ముంబై ఆటగాడు ఇతడే కావడం విశేషం.