Begin typing your search above and press return to search.

వేలంలో అన్ సోల్డ్.. లక్కీగా లీగ్ లోకి.. కట్ చేస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

శార్దూల్ ఠాకూర్.. టీమ్ ఇండియా ఆల్ రౌండర్. బాగానే ఆడుతున్నప్పటికీ జట్టుకు దూరమయ్యాడు.

By:  Tupaki Desk   |   28 March 2025 11:29 AM
Shardul Thakur Sensational Performance
X

టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఆల్ రౌండర్ అతడు.. ఫామ్ లో లేడా? అంటే లేడు అని చెప్పలేం.. ఫిట్ నెస్ లేదా? అంటే లేదని చెప్పలేం.. బంతితో తెలివిగా వికెట్లు తీసేవాడు.. బ్యాట్ తోనూ పరుగులు సాధించేవాడు.. కూర్పు, పరిస్థితుల రీత్యా జట్టుకు దూరమయ్యాడు. అయితే, దేశవాళీల్లో అదరగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 2015 నుంచి క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. అయినా అతడిని గత ఏడాది నవంబరులో జరిగిన మెగా వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. దీంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. కానీ, లక్ అతడిని నడిపించింది.

శార్దూల్ ఠాకూర్.. టీమ్ ఇండియా ఆల్ రౌండర్. బాగానే ఆడుతున్నప్పటికీ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ లో అతడు 2015 నుంచి పుణె, పంజాబ్, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ ఇలా పలు జట్లకు ఆడాడు. నిరుడు చెన్నైకి 9 మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించాడు. 2018 నుంచి 2021 వరకు చెన్నైకే ఆడిన అతడు మూడేళ్ల విరామం తిరిగొచ్చాడు. కానీ, ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు.

అతడి గాయం ఇతడికి వరం

లక్నో ఎంతో ఆశలు పెట్టుకున్న ఎడమచేతి వాటం పేసర్ మొహిసిన్‌ ఖాన్‌ గాయం శార్దూల్ ఠాకూర్ కు వరంగా మారింది. మొహిసిన్ ఈ సీజన్ కు దూరం కావడంతో లక్నో శార్దూల్ ను అతడి ప్రాథమిక ధర రూ.2 కోట్లకు తీసుంది. అదీ గత వారమే. అలా అనుకోకుండా లీగ్ లోకి వచ్చిన శార్దూల్‌.. చక్కగా రాణిస్తున్నాడు.

వాస్తవానికి తాజా రంజీ సీజన్ లో శార్దూల్ ముంబై తరఫున బంతితో బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. అతడే లేకుంటే ముంబై దారుణ ఫలితాలను ఎదుర్కొనాల్సి వచ్చేదే. అయినా ఐపీఎల్ కు శార్దూల్ ను ఎవరూ తీసుకోలేదు. కానీ, మొహిసిన్ ప్లేస్ లో వచ్చీ రావడంతోనే దుమ్మురేపుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తో తొలి మ్యాచ్‌ లో ఆరంభ ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.

గురువారం సన్‌ రైజర్స్‌ తో మ్యాచ్ లో ఐపీఎల్‌ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన (4/34) నమోదు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. . కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భీకర ఫామ్‌ లో ఉన్న సన్‌ రైజర్స్‌ బ్యాట్స్ మెన్ కు కళ్లెం వేశాడు. కాగా, సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ దూరం కావడంతో లక్నో బౌలింగ్‌ బాగా వీక్ అయింది. అలాంటి జట్టుకు అవసరమైతే లోయరార్డర్ లో బ్యాట్ కూడా ఝళిపించగల శార్దూల్‌ ఇప్పుడు ఆశాదీపం.