భల్లే.. భల్లే.. రేటు చెప్పకుండా ఆటగాడి రిటైన్.. పంజాబ్ బేరం అంటే అంతే
ఇక గత ఏడాది నవంబరులోనూ ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా శశాంక్ కు వింత పరిస్థితి ఎదురైందట.
By: Tupaki Desk | 20 March 2025 2:30 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని జట్టు మాత్రమే కాదు.. రెండేసార్లు ప్లేఆఫ్స్ చేరిన దారుణమైన రికార్డు ఆ జట్టుది. అలాంటి జట్టు గత ఏడాది కూడా గొప్పగా ఏమీ ఆడలేదు. కానీ, ఇద్దరు ఆటగాళ్లు మాత్రం ఆకట్టుకున్నారు. జట్టంతా విఫలం అయిన సందర్భంలో బరిలో దిగి గెలిపించినంత పని చేశారు.
ఆ ఇద్దరు ఆటగాళ్లలో ఒకడు శశాంక్ సింగ్. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ఇతడు నిరుడు 164 స్ట్రైక్ రేట్‌తో 354 పరుగులు చేయడం గమనార్హం. దీనికి ప్రతిఫలంగానే పంజాబ్ ఈ ఏడాది అతడిని రిటైన్ చేసుకుంది. అది కూడా రూ.5.5 కోట్లు పెట్టి. పంజాబ్ రిటైన్ చేసుకున్నదే ఇద్దరిని అంటే.. వారిలో ఒకడు శశాంక్. ఇదే కాదు అతడి పంజాబ్ టీమ్ జర్నీ అంతా ఇంతే. 2023లో జరిగిన మినీ వేలంలో శశాంక్ సింగ్ ఎంపిక సందర్భంగా గందరగోళం చోటుచేసుకుంది. శశాంక్ సింగ్ అనే పేరు వేలంలో వినిపించగానే బేస్ ప్రైస్ రూ.20 లక్షలకు కొనుక్కుంది. తాము తీసుకోవాలనుకున్న శశాంక్, ఈ శశాంక్ ఒకరు కాదని తెలిసి శశాంక్ సింగ్ ను వద్దనుకుంది. కానీ, అప్పటికే ఆక్షనర్ వేలాన్ని ముగించడంతో చేసేది ఏం లేకపోయింది.
తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో జట్టులోకి వచ్చినా నిరుడు శశాంక్ పంజాబ్ పరువు నిలిపాడు. జట్టు రిటైన్ చేసుకునే స్థాయికి ఎదిగాడు.
కాగా, తనకు ఐపీఎల్ వేలంలో ఎప్పుడూ టెన్షన్ తప్పలేదని.. ఎవరైనా తీసుకుంటారో లేదో అని తనతో పాటు తన కుటుంబం ఆందోళన చెందేదని శశాంక్ తెలిపాడు.
ఇక గత ఏడాది నవంబరులోనూ ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా శశాంక్ కు వింత పరిస్థితి ఎదురైందట. దీపావళికి మూడు రోజుల ముందు సాయంత్రం తనకు ఫోన్ వచ్చిందని.. తనను రిటైన్ చేసుకుంటున్నట్లు చెప్పి ఫామ్ పంపుతున్నాం.. సంతకం పెట్టి రేపటికల్లా పంపమన్నారని శశాంక్ తెలిపాడు. ఎలాంటి బేరం లేకుండా.. అసలు ఎంత ఇస్తున్నారో కూడా ఆ ఫామ్ లో లేదని చెప్పాడు. చివరకు పంజాబ్ కింగ్స్ అతడిని రూ.5.5 కోట్లకు అట్టిపెట్టుకుంది.
కొసమెరుపు: శశాంక్ సింగ్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ను రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్.. ఏకంగా రూ.26.75 కోట్లు పెట్టి టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ను వేలంలో కొనుక్కుంది. అతడినే కెప్టెన్ చేసింది.