Begin typing your search above and press return to search.

91 ఏళ్లకు 642 బంతులు.. ఒకటిన్నర రోజులు.. అదేం పిచ్?

టెస్టు మ్యాచ్ పిచ్ అంటే ఎలా ఉండాలి.. అటు బౌలర్లకు ఇటు బ్యాట్స్ మన్ కు సవాల్ విసరాలి

By:  Tupaki Desk   |   5 Jan 2024 10:56 AM GMT
91 ఏళ్లకు 642 బంతులు.. ఒకటిన్నర రోజులు.. అదేం పిచ్?
X

టెస్టు మ్యాచ్ పిచ్ అంటే ఎలా ఉండాలి.. అటు బౌలర్లకు ఇటు బ్యాట్స్ మన్ కు సవాల్ విసరాలి.. స్పిన్ కు పేస్ కూ అనుకూలించాలి.. నిలకడగా ఆడే బ్యాటర్లకు పరుగులు చేసే వీలుండాలి.. మేటి బ్యాట్స్ మెన్ సెంచరీలు చేసేలా కనిపించాలి. కానీ, ఇవేవీ భారత్ –దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో కనిపించలేదు. కేప్‌ టౌన్‌ వేదికగా జరిగిన ఈ టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో.. కేప్‌ టౌన్‌ లో గెలిచిన ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. అయితే, కేవలం ఒకటిన్నర రోజుల్లోనే టెస్టు ముగియడమే చర్చకు తావిస్తోంది.

పేస్ కు మరీ ఇంత అనుకూలమా..?

కేప్ టౌన్ పిచ్ పేస్ కు అనుకూలం అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ, మరీ ఇంతగానా? అనే పరిస్థితి వచ్చింది. దీనిపై క్రికెట్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. వికెట్ కీపర్‌ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కూడా నోరెళ్లబెట్టాడు. ''టాస్‌ ఇప్పుడే పడింది.. అంతలోనే మ్యాచ్‌ ముగిసిందన్నట్లుగా ఉంది. పిచ్ ఇలా మారుతుందని అనుకోలేదు. బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది'' అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ టెస్టు మ్యాచ్ 642 బంతుల్లోనే పూర్తయిపోయింది. చరిత్రలో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ రెండు రోజుల్లోపే ముగియడం ఇది 25వ సారి మాత్రమే. కేప్‌టౌన్‌ టెస్టులో బౌలర్లు వేసిన మొత్తం బంతుల పరంగా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్‌ ఇదే. 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్‌బోర్న్‌ లో జరిగిన టెస్ట్‌ 656 బంతుల్లో ముగిసింది. ఇప్పటివరకు అదే అతి పొట్టి టెస్టు మ్యాచ్‌. అంటే 91 ఏళ్ల కిందటి రికార్డును కేప్ టౌన్ టెస్టు బద్దలుకొట్టిందన్నమాట.

మూడో టెస్టు కూడా ఆడొచ్చేమో..?

దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియా రెండు టెస్టులే ఆడింది. అయితే, ఇంకా మూడున్నర రోజులు ఉండగానే రెండో టెస్టు ముగిసిన పరిస్థితిని చూసి.. మూడో టెస్టు కూడా ఆడొచ్చేమో? అనే వ్యంగ్య విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఇదే విధంగా మాట్లాడాడు. ''సిరీస్ లో మూడో టెస్టు కూడా ఆడేసి భారత్ సమయానికి స్వదేశానికి వెళ్లిపోవచ్చు. కేప్ టౌన్ లో శుక్రవారం మూడో టెస్టును ప్రారంభిస్తే సరిపోతుంది. తప్పకుండా ఫలితం వస్తుంది'' అని అన్నాడు.