Begin typing your search above and press return to search.

ఫిట్నెస్.. ఫామ్..అంతా ఓకే.. టీమిండియా క్రికెటర్ కు రైట్ రైట్..

తొమ్మిదేళ్ల కిందట 22 ఏళ్ల కుర్రాడిగా టీమిండియాలో అడుగుపెట్టిన రాహుల్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అంతేస్థాయిలో నిరాశపరిచాడు కూడా

By:  Tupaki Desk   |   12 Sep 2023 7:40 AM GMT
ఫిట్నెస్.. ఫామ్..అంతా ఓకే.. టీమిండియా క్రికెటర్ కు రైట్ రైట్..
X

దాదాపు ఆరు నెలలైంది అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. నాలుగు నెలలు దాటింది మైదానంలోకి దిగి.. ఫామ్ తోనే దోబూచులాడుతున్నాడంటే.. ఫిట్ నెస్ లోనూ చాలా వీక్ గా ఉన్నాడన్న పేరు.. ఇఫ్పుడు ఆడకుంటే ఇక జట్టులోకి రాలేడనేంతగా పీక మీద కత్తి. కానీ, ఒక్క ఇన్నింగ్స్ తో అన్నిటికీ సమాధానం చెప్పాడు అతడు. జట్టు సమస్యకూ పరిష్కారం చూపాడు. చిరకాల ప్రత్యర్థిపై సెంచరీ కొట్టి రైట్ రైట్ అనిపించుకున్నాడు.

టీమిండియా ప్రపంచ కప్ జట్టు ఎంపిక సందర్భంగా అత్యంత చర్చనీయాంశమైన పేరు కేఎల్ రాహుల్. ప్రతిభావంతుడే అయినప్పటికీ.. దానికి న్యాయం చేయడనే పేరున్న రాహుల్ మేలో ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డాడు. అంతకుముందు అతడి ఫామ్ కూడా గొప్పగా ఏమీ లేదు. అందుకే ప్రపంచకప్‌ జట్టులో రాహుల్‌ పేరుండడం చూసి చాలామంది విమర్శలు చేశారు. కిషన్ లాంటి కుర్రాడు ఉండగా.. అతడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లగానూ భావించారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ తో తొలి మ్యాచ్‌ ద్వారా పునరాగమనం చేస్తాడనుకుంటే చిన్న గాయం అంటూ తప్పుకొన్నాడు.

తొమ్మిదేళ్ల కిందట 22 ఏళ్ల కుర్రాడిగా టీమిండియాలో అడుగుపెట్టిన రాహుల్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అంతేస్థాయిలో నిరాశపరిచాడు కూడా. అయితే, అతడు స్వతహాగా ఓపెనర్. జట్టులో ఆ చోటు ఖాళీ లేకపోవడంతో కెరీర్ మొదట్లో మిడిలార్డర్ లో ఆడాడు. అవన్నీ పక్కనపెడితే రాహుల్ అంచనాలను అందుకోలేకపోయాడు. దీనికితోడు రెండు మూడేళ్లగా గాయాల బెడద తోడైంది. జట్టులోకి వస్తూ పోతున్నాడు. ఐపీఎల్ లో తొడ గాయానికి గురయ్యాడు. దాన్నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఎంతవరకు ఫిట్ గా ఉన్నాడో చూద్దామంటే పాక్, నేపాల్ లతో మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే, వాటన్నిటికీ పాకిస్థాన్‌ తో సూపర్‌ -4 మ్యాచ్‌ లో అద్భుత ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాడు. ఫామ్‌, ఫిట్‌నెస్‌పై ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాటాడు.

అదే క్లాస్.. అదే దూకుడు..

రాహుల్ క్లాస్ ప్లేయర్. అతడి స్ట్రోక్ ప్లే, కట్ షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. పాక్ తో నిన్నటి ఇన్నింగ్స్ లో ఆ షాట్లను మళ్లీ చూపించాడు. ఆఫ్రిది బౌలింగ్ లో బంతిని వికెట్ల వెనుక బౌండరీకి పంపిన తీరు, స్పిన్నర్ల బౌలింగ్ లో కొట్టిన స్వీప్ షాట్లు ఆకట్టుకున్నాయి. ఇక రాహుల్ కొట్టిన ఓ షాట్ సిక్స్ గా వెళ్లగా.. డగౌట్ లోని కెప్టెన్ రోహిత్ ఔరా అని నోరెళ్లబెట్టాడు. ఇక పాక్ బౌలర్లను రాహుల్ సమర్థంగా ఎదుర్కొంటూ సుదీర్ఘ సమయం తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. కాగా, నాలుగేళ్లుగా జట్టులో నంబర్ 4 స్థానంపై చాలా చర్చలు సాగాయి. మిడిలార్డర్ లో కీలకమైన ఈ స్థానంలో దాదాపు ఐదేళ్లుగా ఎవరూ నిలకడగా ఆడడం లేదు. ఇప్పుడు రాహుల్ దానికి పరిష్కారం చూపాడు. వాస్తవానికి రాహుల్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కానీ, అతడిని ఆడించాలంటే.. నిలకడగా ఆడుతున్న కిషన్‌ ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి. ఇది చాలా విమర్శలకు దారితీసేంది. ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా అనుభవం, ఫామ్‌ పరంగా తనే సరైన ఎంపిక అని రాహుల్ చాటాడు. నిన్నటి మ్యాచ్ లో వికెట్‌ కీపింగ్‌ కూడా చేసి ఆకట్టుకున్నాడు.

అయ్యర్ కు చోటు కష్టమే..?

రాహుల్ లాగే మరో ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్. కానీ, అతడూ తరచూ గాయపడుతున్నాడు. పాక్ తో తొలి లీగ్ మ్యాచ్ ద్వారా తిరిగొచ్చినప్పటికీ విఫలమయ్యాడు. సూపర్ 4 మ్యాచ్ కు ముందు గాయపడ్డాడు. అయితే, శ్రేయస్ ప్రపంచ కప్ నకు ఎంపికయ్యాడు. ఇప్పుడు రాహుల్ తిరిగిరావడమే కాక సెంచరీ కూడా కొట్టడంతో అయ్యర్ మిగతా మ్యాచ్ లకు బెంచ్ కు పరిమితం కాక తప్పదు.