Begin typing your search above and press return to search.

టీమిండియా బ్యాటర్ పై వేటు కత్తి.. ఈ మ్యాచ్ లో ఆడకుంటే అంతే?

అతడు గాయపడితే అబ్బా.. అన్నారు. కోలుకుని తిరిగివస్తే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గాయపడితే ఆందోళన చెందారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:57 AM GMT
టీమిండియా బ్యాటర్ పై వేటు కత్తి.. ఈ మ్యాచ్ లో ఆడకుంటే అంతే?
X

అతడు గాయపడితే అబ్బా.. అన్నారు. కోలుకుని తిరిగివస్తే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గాయపడితే ఆందోళన చెందారు. ఎట్టకేలకు ప్రపంచ కప్ ముంగిట తిరిగొస్తే ఇక తిరుగులేదని భావించారు. కానీ, ఎప్పటిలాగానే బలహీనతకు ఔటవుతూ వస్తుండడంతో ఇకమీదట ఇలాగైతే కష్టమే అంటున్నారు. జట్టులో చోటుకు పోటీ తీవ్రంగా ఉండడంతో మరొక్క చాన్స్ మాత్రమే అని చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది.

నంబర్ 4లో నిఖార్సైనోడు అనుకుంటే..

అజింక్య రహానే దూరమయ్యాక, అంబటి రాయుడును పక్కనపెట్టాక గత ఐదేళ్లలో టీమిండియా ఎదుర్కొన్న ప్రధాన సమస్య నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ కు దిగేది ఎవరని? టెస్టుల్లో ఎలాగూ విరాట్ కోహ్లి ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. టి20 గేమ్ లో ఈ నంబరుపై చర్చనే అవసరం లేదు. కానీ, వన్డేలకు వచ్చేసరికి మాత్రం నంబర్ 4లో ఎక్కువ ఓవర్లు నిలిచే బ్యాట్స్ మన్ కావాలి. ఆ స్థానానికి న్యాయం చేసేవాడిలా కనిపించాడు శ్రేయస్ అయ్యర్. కానీ, ప్రపంచ కప్ లో అతడి బలహీనత బయటపడిపోతోంది

షార్ట్ టెంపర్ వదులుకోకుంటే..

మనిషికి షార్ట్ టెంపర్ ఎంత చేటు చేస్తుందో.. క్రికెట్ లో షార్ట్ బాల్ ను సరిగా ఆడకుంటే అంతే చేటు కలుగుతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. శ్రేయస్ అయ్యర్ మిగతా అన్ని షాట్లు బాగానే ఆడినా, షార్ట్ బంతులను ఎదుర్కొనడంలో మాత్రం బలహీనం. ప్రపంచ కప్ లో ఆరు మ్యాచ్‌లు గాను అతడు చేసింది 134 పరుగులే. జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా లేదు. హేజిల్‌ వుడ్‌ (ఆస్ట్రేలియా), ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్‌ (ఇంగ్లాండ్)ల బౌలింగ్ లో షార్ట్ బంతులకే అయ్యర్ వికెట్ పారేసుకున్నాడు. ఈ మూడు జట్లూ పెద్ద జట్లే కావడం గమనార్హం. ఇక భారత్ లో వన్డేల్లో 8 సార్లు, విదేశీ వేదికలపై 6 సార్లు అయ్యర్ షార్ట్ బంతులకు వికెట్ ఇచ్చేశాడు. ఇప్పటివరకు 48 ఇన్నింగ్స్ ఆడిన అతడు 14సార్లు.. పుల్‌ షాట్లు కొట్టబోయే పెవిలియన్ చేరాడు.

హార్దిక్ వస్తే.. ఇషాన్ ను తీసుకుంటే అయ్యర్ ఔట్..

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కనుక కోలుకుంటే.. అయ్యర్ ను పక్కనపెట్టే చాన్సుంది. సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగిస్తూ, కేఎల్ రాహుల్ ను నాలుగో నంబరులో పంపే ఆలోచన చేసే వీలుంది. ఎందుకంటే.. రాహుల్ కు గతంలో నాలుగో నంబరులో ఆడిన అనుభవం ఉంది. అదీకాదంటే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ను తీసుకుని అయ్యర్ ను బెంచ్ కు పరిమితం చేయొచ్చు. అసలే జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ఒక్కరూ లేరు. ఇషాన్ ను ఆడించడం ద్వారా ఆ లోటును తీర్చవచ్చు. ఏది ఏమైనా.. గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో అయ్యర్ రాణించకుంటే మాత్రం అతడిపై వేటుపడడం ఖాయం.