Begin typing your search above and press return to search.

పదేళ్లకు కామెంట్రీ రీ ఎంట్రీ.. రోజుకు రూ.25 లక్షలు

టీమిండియా మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   20 March 2024 7:21 AM GMT
పదేళ్లకు కామెంట్రీ రీ ఎంట్రీ.. రోజుకు రూ.25 లక్షలు
X

అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ అనంతరం ఎంచుకునే రంగం కామెంట్రీ.. వందల మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నా లేకున్నా.. ఏళ్ల తరబడి మైదానంలో గడిపిన అనుభవం.. క్రికెట్ పట్ల ఉన్న లోతైన అవగాహన వారికి బాగా ఉపయోగపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ కు ఇంత అని చొప్పున మాట్లాడుకుని, కామెంట్రీ చేస్తుంటారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఓ చానెల్ కు ఇలానే పనిచేశారు. తాజాగా మరో మాజీ క్రికెటర్ కామెంట్రీ బాక్స్ లోకి అడుగుపెడుతున్నాడు. అయితే.. అతడికి ఇది కొత్త కాదు.

సిక్సర్ల సిద్ధూ

టీమిండియా మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబీకి ఉండే సహజ దూకుడుతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడంటే అందరూ అలవోకగా సిక్సర్లు కొడుతున్నారు. కానీ, ఓ 30-35 ఏళ్ల కిందట చాలా తక్కువమంది ఆటగాళ్లకు మాత్రమే ఆ సామర్థ్యం ఉండేది. ఇలాంటివారిలో సిద్ధూ ఒకరు. ఆత్మగౌరవం మెండుగా ఉన్న క్రికెటర్ కూడా. దీంతోనే చాలాసార్లు వివాదాలను ఎదుర్కొన్నాడు.

పదేళ్ల తర్వాత.. తనదైన చలోక్తులు

సిద్దూ 10 ఏళ్ల విరామం తర్వాత కామెంట్రీకి దిగుతున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌ లో వ్యాఖ్యానం చేయనున్నాడు. దీన్ని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ వెల్లడించింది. సిద్ధూ బ్యాటింగ్ దూకుడుగా ఉంటే అతడి కామెంట్రీ ప్రత్యేకంగా ఉంటుంది. తనదైన పంచ్‌ లు, ప్రాసలు, జోకులతో నవ్వులు పండిస్తాడు. ప్రముక కమెడియన్ కపిల్ శర్మ షోలో సిద్ధూ పండించే హాస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వ్యాఖ్యాతగా తొలి రీ ఎంట్రీ..

క్రికెట్ తన ఫస్ట్ లవ్‌ అని.. అభిరుచి వృత్తిగా మారితే అంతకంటే గొప్ప పని ఉండదని అంటున్నాడు సిద్ధూ. క్రికెట్‌లో 20 సార్లు పునరాగమనం చేసిన తాను కామెంటేటర్‌ గా తొలిసారి రీఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఇలా అంటూనే ‘‘చేపకు ఈత నేర్పడం.. నాకు కామెంట్రీ గురించి చెప్పడం’’ ఒకటేనని తనదైన పంచ్ విసిరాడు. గ్యాప్‌ వచ్చినా తనలో మాటల పదును తగ్గలేదని చెబుతున్నాడు.

టోర్నీకి రూ.70 లక్షలు.. మ్యాచ్ కు రూ.25 లక్షలు

ఇదివరకు టోర్నీ మొత్తం కామెంట్రీ చేస్తే రూ.60-70 లక్షలు ఇచ్చేవారని.. ఐపీఎల్‌ లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నానని సిద్దూ చెప్పాడు. . లీగ్ కేవలం డబ్బుతో సంతృప్తి దొరకదని.. ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపడం సరదాగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, సిద్ధూ పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతడి భార్య కూడా పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ పై సిద్ధూ పీసీపీ చీఫ్ గా ఉన్నప్పుడు తిరుగుబావుటా ఎగురవేశాడు. ఇది చివరకు సీఎంను మార్చే స్థితికి తెచ్చింది. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.