Begin typing your search above and press return to search.

సిమ్రన్ షేక్..ధారావి స్లమ్ నుంచి..డబ్ల్యూపీఎల్ వేలంలో 1.70 కోట్లకు

సిమ్రన్ షేక్.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావికి చెందిన అమ్మాయి. 21 ఏళ్ల సిమ్రన్.. గతంలో యూపీ వారియర్స్ కు ఆడింది. అమ్మాయిల్లో తన వయసు వారెవరూ క్రికెట్ ఆడని ధారావిలో ఆమె అబ్బాయిలతోనే కలిసి ఆడింది.

By:  Tupaki Desk   |   15 Dec 2024 12:30 PM GMT
సిమ్రన్ షేక్..ధారావి స్లమ్ నుంచి..డబ్ల్యూపీఎల్ వేలంలో 1.70 కోట్లకు
X

సరిగ్గా మూడు వారాల కిందట జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం అందరికీ ఇంకా గుర్తుంది. నవంబరు మూడో వారంలో జరిగిన ఈ వేలంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ రూ.27 కోట్ల ధర పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ రేటుకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ రేటు. దీంతోపాటు శ్రేయస్ అయ్యర్ కు పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు ధర వెచ్చించింది. దీంతో ఐపీఎల్ దద్దరిల్లింది. ఇప్పుడు తాజాగా ఆదివారం మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కొత్త సీజన్‌ కోసం బెంగళూరులో మినీ వేలం జరుగుతోంది.

మహిళల్లోనూ మనోళ్లకే..

పురుషుల క్రికెట్ లో ఈ ఏడాది అత్యధిక ధర పంత్ కు దక్కగా మహిళల వేలంలోనూ ఆ రికార్డు భారతీయులకే దక్కింది. మహిళల జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్‌ షేక్ ను రూ.1.90 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. ఈమె ప్రాథమిక ధర రూ.10 లక్షలు మాత్రమే కావడం విశేషం. అయితే, సిమ్రన్ కోసం ఢిల్లీ, గుజరాత్ పోటీపడ్డాయి. దీంతో భారీ ధర దక్కింది.

సిమ్రన్ షేక్.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావికి చెందిన అమ్మాయి. 21 ఏళ్ల సిమ్రన్.. గతంలో యూపీ వారియర్స్ కు ఆడింది. అమ్మాయిల్లో తన వయసు వారెవరూ క్రికెట్ ఆడని ధారావిలో ఆమె అబ్బాయిలతోనే కలిసి ఆడింది. 15 ఏళ్ల వయసు వచ్చాక గానీ కోచింగ్ కు వెళ్లలేదు. నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల కుటుంబంలో పుట్టిన సిమ్రన్.. అత్యంత పేదరికం చూసింది. అలాంటి స్థితి నుంచి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది.

కాగా, డబ్ల్యూపీఎల్ వేలంలో వెస్టిండీస్ ఆల్‌ రౌండర్ డియాండ్రా డాటిన్ ను రూ.1.70 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ తీసుకుంది. ఈమె కనీస ధర రూ.50 లక్షలు. గుజరాత్, యూపీ పోటీపడగా గుజరాత్ దక్కించుకుంది. గమనార్హం ఏమంటే.. ప్రాథమిక ధర రూ.30 లక్షలతో వేలంలో నిలిచిన భారత స్పిన్నర్ పూనమ్‌ యాదవ్ ను ఎవరూ తీసుకోలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ రూ.50 లక్షల ప్రాథమిక ధరకే అందుబాటులోకి వచ్చినా ఎవరూ తీసుకోలేదు.

16 ఏళ్ల భారత అమ్మాయికి..

తమిళనాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్ 16 ఏళ్ల జి.కమలినికీ భారీ ధర దక్కింది. కనీస ధర రూ.10 లక్షలైతే ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీలు పడ్డాయి. చివరకు ముంబై రూ.1.60 కోట్లకు తీసుకుంది. అండర్‌-19 టీ20 ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేయడం కమలినికి కలిసొచ్చింది. వికెట్ కీపరే కాదు.. పార్ట్‌ టైమ్ స్పిన్నర్‌ కూడా.

మొత్తం 120 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. ఐదు జట్లు వీరిని కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో జట్టులో 18 మంది ఉండొచ్చు. 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో ఐదు విదేశీ ఆటగాళ్లవి.