Begin typing your search above and press return to search.

అమ్మో అంత వేగమా..? సిరాజ్.. గులాబీ బంతి.. 181 కిలోమీటర్లు

సిరాజ్ సాధారణ వేగం 135 కిలోమీటర్లు. అప్పుడప్పుడు గరిష్ఠ వేగం 142 కిలోమీటర్లు దాటుతోంది. దీంతోనే తాజా 181.6 కిలోమీటర్ల వేగం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:30 PM GMT
అమ్మో అంత వేగమా..? సిరాజ్.. గులాబీ బంతి.. 181 కిలోమీటర్లు
X

అసలే ఆస్ట్రేలియా పిచ్ లు.. పేస్ బౌన్స్ కు పేరొందిన ఆడిలైడ్ మైదానం.. పైగా గులాబీ బంతితో డే-నైట్ టెస్టు.. ఇంకేం.. బంతి సర్రున దూసుకెళ్తోంది.. బౌలర్ చేతినుంచి బయటకు వచ్చిందే ఆలస్యం.. బ్యాట్స్ మన్ కళ్లుగప్పి మాయచేస్తోంది. కొన్నిసార్లు వదిలేసే అవకాశం కూడా లేకుండా బ్యాట్ ను ముద్దాడుతూ ఔట్ చేస్తోంది. ఇదే క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన పేసర్ మొహ్మద్ సిరాజ్ ఓ అరుదైన సందర్భంలో చిక్కుకున్నాడు.

ఇది వరల్డ్ రికార్డు

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడుతోంది టీమ్ ఇండియా. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. సిరాజ్‌ ఆఫ్‌ స్టంప్‌ అవతల వేసిన బంతిని ఆసీస్ బ్యాట్స్ మన్ లబుషేన్‌ డీప్‌ బ్యాక్‌ వర్డ్‌ పాయింట్‌ దిశగా బౌండరీ కొట్టాడు. అయితే, ఈ బంతి వేగాన్ని స్పీడ్‌ గన్‌ 181.6 కిలోమీటర్లుగా చూపింది. దీంతో ఇదేందిది అని అంతా అవాక్కయ్యారు.

స్పీడ్ గన్ గమ్మత్తు..

సిరాజ్ సాధారణ వేగం 135 కిలోమీటర్లు. అప్పుడప్పుడు గరిష్ఠ వేగం 142 కిలోమీటర్లు దాటుతోంది. దీంతోనే తాజా 181.6 కిలోమీటర్ల వేగం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. కానీ, దీనికి కారణం సాంకేతిక తప్పిదం. అయితే, ఇదే మొదటిసారే కాదు.. భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ కూ ఈ అనుభవం ఎదురైంది. ఓ బంతి 201 కిలోమీటర్లు, 208 కిలోమీటర్లు వేగం అని స్పీడ్‌ గన్ చూపించింది. ఐర్లాండ్‌ తో 2022లో జరిగిన మ్యాచ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు కూడా స్పీడ్ గన్ పొరపాటే. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్ తో హంగామా చేస్తున్నారు.

అసలు గరిష్ఠ వేగం ఎంత..?

ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన బంతి పాకిస్థాన్ పేసర్ షోయబ్‌ అక్తర్‌ ది. 2003 వన్డే ప్రపంచ కప్‌ లో ఇంగ్లాండ్‌ తో మ్యాచ్‌ లో అక్తర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు.