Begin typing your search above and press return to search.

కివీ రెక్కల్లో తెలుగు కుర్రాడు.. మన బెజవాడ వాడే

దీపక్ పటేల్.. జీతన్ పటేల్.. ఎజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర.. ఇష్ సోధి.. ఇదీ న్యూజిలాండ్ కు ఆడిన భారత సంతతి క్రికెటర్ల జాబితా.

By:  Tupaki Desk   |   22 Jan 2024 1:30 PM GMT
కివీ రెక్కల్లో తెలుగు కుర్రాడు.. మన బెజవాడ వాడే
X

ప్రపంచ క్రికెట్ లో ప్యూర్ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడే దేశం ఏదంటే అందరూ చెప్పే పేరు ఒక్కటే.. ఇప్పుడనే కాదు.. దశాబ్దాలుగా ఆ దేశం ఆటగాళ్లు అంతే.. ఓడినా గెలిచినా వారికి పెద్దగా పట్టింపులుండవు. మరో మ్యాచ్ లో చూసుకుందాం లేం అనుకుంటారు. పరువు పోతున్నదనో..? ప్రత్యర్థిని దూషిద్దామనో అనుకోరు.. మొత్తానికి జెంటిల్ మన్ గేమ్ లో జెంటిల్ మన్ జట్టు అన్నమాట. అలాంటి టీమ్ లో తరతరాలుగా భారతీయులకూ చోటుదక్కుతోంది. ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు కుర్రాడికే అవకాశం వచ్చింది.

దీపక్ నుంచి రచిన్ వరకు..

దీపక్ పటేల్.. జీతన్ పటేల్.. ఎజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర.. ఇష్ సోధి.. ఇదీ న్యూజిలాండ్ కు ఆడిన భారత సంతతి క్రికెటర్ల జాబితా. ఇందులో రచిన్ స్పిన్ ఆల్ రౌండర్. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో సెంచరీల మీద సెంచరీలు కొట్టి ఔరా అనిపించాడు. దీపక్ పటేల్ 30 ఏళ్ల కిందటే మార్టిన్ క్రో వంటి దిగ్గజంతో కలిసి ఆడాడు. ఎజాజ్ పటేల్.. టెస్టు క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ రికార్డును అతడు భారత్ పైనే సాధించడం మరో విశేషం.

వచ్చాడు.. అండర్ 19 కుర్రాడు..

పైన చెప్పుకొన్న క్రికెటర్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ లోకి దూసుకొస్తున్నాడు ఓ కుర్రాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ లో ప్రస్తుత న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు 17 ఏళ్ల స్నేహిత్ రెడ్డి. అంతేకాదు.. నేపాల్ తో మ్యాచ్ లో భారీ సెంచరీ కొట్టాడు. 127 బంతుల్లోనే 147 పరుగులు చేసి దుమ్మురేపాడు. కాగా , ఈ కుర్రాడు సొంత ఊరు మరేదో కాదు.. మన విజయవాడనే. స్నేహిత్ పుట్టినప్పటికే అతడి తల్లిదండ్రులు న్యూజిలాండ్ లో ఉన్నారు. అతడు అక్కడే పెరిగి మంచి క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ ను అభిమానించే స్నేహిత్.. నేపాల్ తో మ్యాచ్ తర్వాత అచ్చం గిల్ లాగే అభివాదం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన స్నేహిత్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. అతడు ఇలానే ఫామ్ ను కొనసాగిస్తే భవిష్యత్ లో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఎంపికవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.