క్రికెట్ లో పెద్ద స్టార్లే.. సెంచరీ కొట్టలేని బ్యాటర్లు.. ఈ కాలం వారే
వన్డే క్రికెట్ లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 50 సెంచరీలు చేసి ఇంకా ఆడుతున్నాడు.
By: Tupaki Desk | 29 Aug 2024 1:30 PM GMTభారత క్రికెట్ లో దిగ్గజ బ్యాట్స్ మన్ ఎవరు అంటే..? విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ పేర్లు సహజంగానే వస్తాయేమో? కానీ, అసలు సిసలు దిగ్గజ బ్యాటర్ అంటే మాత్రం సునీల్ గావస్కర్ పేరు చెప్పాల్సిందే. వెస్టిండీస్ అరివీర భయంకర పేసర్లను హెల్మెట్ కూడా లేకుండానే ఎదుర్కొని సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు గావస్కర్. అలాంటి గావస్కర్ వన్డేల్లో మాత్రం పెద్దగా రాణించలేదు. దీంట్లో ఆయన పొరపాటేం లేదు. గావస్కర్ కాలం నాటికి వన్డేలు అంత ఊపులోకి రాలేదు. అయితే, మోస్తరుగా వన్డేలు ఆడిన గావస్కర్ తన చిట్టచివరి వన్డేలో సెంచరీ కొట్టి చరిత్రలో నిలిచిపోయాడు. కానీ, కొందరు క్రికెటర్లు దశాబ్దాల పాటు వన్డేల్లో మూడంకెలు చేరలేకపోయారు.
కోహ్లి 50.. సచిన్ 49.. వీరు మాత్రం 0
వన్డే క్రికెట్ లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 50 సెంచరీలు చేసి ఇంకా ఆడుతున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు కొట్టాడు. కానీ, వీరిలాగే దశాబ్దాల పాటు తమ దేశాలకు ఆడిన కొందరు ఆటగాళ్లు.. ఒక్కసారి కూడా హెల్మెట్ తీసి బ్యాట్ ను పైకి ఎత్తడం (సెంచరీ అభివాదం) చేయలేకపోయారు.
వంద టెస్టులు ఆడాడు.. కానీ,
ఇటీవల చనిపోయిన ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ గ్రాహం థోర్ప్ 12 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు. సరిగ్గా వంద టెస్టులు ఆడాడు. అంటే ఓ క్రికెటర్ గా అరుదైన మైలురాయిని చేరాడు. ఇతడి టెస్టు సగటు 44.66 కావడం గమనార్హం. 1993-2005 మధ్య సాగిన అతడి కెరీర్ లో 82 వన్డేలు కూడా ఆడాడు. 2,380 పరుగులు చేసిన థోర్ప్.. 89 పరుగుల వద్దనే ఆగిపోయాడు. మిడిలార్డర్ లో చెప్పుకోదగ్గదైన 37 సగటు ఉన్నప్పటికీ.. ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈ నెల 4న థోర్ప్ చనిపోయాడు.
సెంచరీ లేని కెప్టెన్..
ఇంగ్లండ్ కు టెస్టుల్లో మెరుగైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మైకేల్ వాన్ 82 టెస్టులు ఆడాడు. 5719 పరుగులు చేశాడు. 2001-07 మధ్య 86 వన్డేలు ఆడిన వాన్ ఒక్కసారీ మూడంకెలు చేరలేకపోయాడు. 83 ఇన్నింగ్స్ లలో 1,982 పరుగులు చేశాడు. సగటు 27.15 మాత్రమే. వాన్ 16 అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్.
మిస్బా.. నువ్వు కూడా మిస్ నా?
2007 టి20 ప్రపంచ కప్ లో చివరి ఓవర్ లో అనవసర స్కూప్ షాట్ ఆడి ఔటైన మిస్బా ఉల్ హక్ భారత్ కు ప్రపంచ కప్ అందేలా చేశాడు. చాలా ఆలస్యం జాతీయ జట్టులోకి వచ్చిన అతడు 40 ఏళ్లు దాటాక కూడా ఆడాడు. అయితే, మిస్బా 2002లోనే పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. కానీ, ఆకట్టుకోలేకపోవడంతో ఐదేళ్లు జట్టుకు దూరమయ్యాడు. 2007 నుంచి మాత్రం తిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది. పాకిస్థాన్ కు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2015లో చివరి వన్డే ఆడిన అతడు.. 162 మ్యాచ్ లలో పాక్ కు రిప్రజెంట్ చేశాడు. 149 ఇన్నింగ్స్ లలో 31 సార్లు నాటౌట్ గా నిలిచి 5,122 పరుగులు చేశాడు. సగటు 43.. కానీ, ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఓసారి 96 వద్ద నాటౌట్ గా ఆగిపోయాడు. మిగతా 41 అర్ధ సెంచరీలనూ సెంచరీలుగా మలచలేకపోయాడు.
ది ఫినిషర్.. దినేశ్ కార్తీక్ సైతం..
టీమ్ ఇండియాకు ముఖ్యంగా టి20ల్లో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు దినేశ్ కార్తీక్. దిగ్గజం ధోనీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. 2004లో తొలి వన్డే ఆడాడు. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో సెంచరీ కొట్టలేదు.. సెంచరీ వన్డేలు (94 మ్యాచ్) కూడా ఆడలేదు. 30.2 సగటుతో 79 ఇన్నింగ్స్ లలో 1,752 పరుగులు చేసిన డీకే.. తొమ్మిది హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకున్నడు. అత్యధిక స్కోరు 79.