Begin typing your search above and press return to search.

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం.. ఇకపై కూన అనలేరు

వన్డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ లాంటి మాజీ చాంపియన్ ను ఓడించింది.. టి20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ వరకు చేరింది.. వన్డేల్లో మేటి జట్లనూ మట్టికరిపిస్తోంది.. టెస్టుల్లో కాస్త నిలకడ తోడైతే ప్రపంచ స్థాయి జట్టుగా హోదా ఇవ్వొచ్చు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 7:30 PM GMT
ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం.. ఇకపై కూన అనలేరు
X

వన్డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ లాంటి మాజీ చాంపియన్ ను ఓడించింది.. టి20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ వరకు చేరింది.. వన్డేల్లో మేటి జట్లనూ మట్టికరిపిస్తోంది.. టెస్టుల్లో కాస్త నిలకడ తోడైతే ప్రపంచ స్థాయి జట్టుగా హోదా ఇవ్వొచ్చు. ఈ క్రమంలో ఈ చిన్న జట్టు ఓ పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా గెలవని ప్రత్యర్థిపై ఏకంగా సిరీస్ ను సాధించింది.

దక్షిణాఫ్రికాకు నిద్ర లేని రాత్రులు

షార్జా.. ఇప్పుడు క్రికెట్ అభిమానులు అందరూ మర్చిపోయిన పేరు. 30 ఏళ్ల కిందట షార్జాలో క్రికెట్ టోర్నీ అంటే భారత్ లోని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేవారు. మరీ ముఖ్యంగా భారత్- పాకిస్థాన్ మధ్యన ఇక్కడ వేసవిలో క్రికెట్ పోటీలు జరిగేవి. నాడు ఐపీఎల్ లేకపోవడంతో షార్జా మ్యాచ్ లు మంచి మజా ఇచ్చేవి. కానీ, ఫిక్సింగ్ భూతంతో షార్జా ప్రతిష్ఠ మసకబారింది. అలాంటి చోట ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది అఫ్ఘానిస్థాన్. స్వదేశంలో మ్యాచ్ లు ఆడే పరిస్థితి లేకపోవడంతో భారత్, షార్జాలను తమ వేదికలుగా చేసుకుంటోంది అఫ్ఘాన్.

తొలి వన్డేలోనే చుక్కలు

మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో గత బుధవారం షార్జాలో తొలి వన్డే ఆడిన అఫ్ఘానిస్థాన్ ప్రత్యర్థికి చుక్కలు చూపింది. ప్రపంచ క్రికెట్ లో పెద్ద జట్లలో ఒకటైన సఫారీలను కేవలం 106 పరుగులకే చుట్టేసింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ టార్గెట్ ను కొట్టేసింది.

శుక్రవారం రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగి ఏకంగా 311 పరుగులు చేసింది. ఆపై దక్షిణాఫ్రికాను 134 పరుగులకే ఆలౌట్ చేసింది. 177 పరుగుల ఆధిక్యంతో గెలుపొంది సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. పరుగులు పరంగా వన్డేల్లో అఫ్ఘానిస్థాన్ కు ఇదే అతిపెద్ద విజయం. అంతేకాదు.. దక్షిణాఫ్రికా వన్డే విజయం, వన్డే సిరీస్ సాధించడం కూడా ఇదే మొదటిసారి. శుక్రవారం మ్యాచ్ లో బర్త్ డే బాయ్ రషీద్ ఖాన్ 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి అఫ్గాన్ కు మరుపురాని విజయాన్ని అందించాడు.

షార్జాలో అఫ్ఘానిస్థాన్ ప్రదర్శన చూసిన వారికి ఇకపై ఆ జట్టును పసికూన అనడానికి సందేహిస్తారేమో..? బ్యాటింగ్ లో, బౌలింగ్ లో ఆ స్థాయిలో అదరగొడుతోంది అఫ్ఘానిస్థాన్. ఆ జట్టుకు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ దక్షిణాఫ్రికాపై 50 బంతుల్లోనే 86 పరుగులు బాదేశాడు. జట్టు స్కోరును 300 దాటించాడు. ఇక రషీద్ తో పాటు నంగేలియా కరోటే అనే కొత్త కుర్రాడు 4 వికెట్లు తీశాడు.