విజయానికి, ఓటమికి మధ్య.. ఓ బౌండరీ.. బంగ్లా-దక్షిణాఫ్రికా 'ఢీ'ఆర్ఎస్
మ్యాచ్ లో ఓడినా.. గొప్ప బౌలింగ్ తో సఫారీలను కట్టడి చేసి.. బ్యాటింగ్ లో విజయానికి దగ్గరగా వెళ్లింది బంగ్లాదేశ్
By: Tupaki Desk | 11 Jun 2024 8:01 AM GMTజరుగుతున్నది టి20 ప్రపంచ కప్ నా? లేక టెస్టు మ్యాచా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అమెరికా వేదికగా సాగుతున్న టి20 ప్రపంచ కప్. మొన్నటికి మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఒక్క ఇన్నింగ్స్ లో దాదాపు 300 స్కోరుకు దగ్గరగా వచ్చిన పరిస్థితి. కానీ, అది ముగిసిన వారంలోనే అమెరికాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో మాత్రం కనీసం 100 పరుగులైనా కష్టంగా కనిపిస్తోంది. అంతగా బౌలర్ల జోరు కొనసాగుతోంది. అయితే, ఆ చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని జట్లు గెలుస్తున్నాయి. మొన్న పాకిస్థాన్ పై భారత్ 119 పరుగులే చేసి నెగ్గగా.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా 113 పరుగులే కొట్టినా గట్టెక్కింది. మ్యాచ్ లో ఓడినా.. గొప్ప బౌలింగ్ తో సఫారీలను కట్టడి చేసి.. బ్యాటింగ్ లో విజయానికి దగ్గరగా వెళ్లింది బంగ్లాదేశ్.
టి20 ప్రపంచ కప్‌లో సోమవారం 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మొదట దక్షిణాఫ్రికా ఆరు వికెట్లకు 113 పరుగులే చేసింది. క్లాసెన్ (46; 44 బంతుల్లో 2×4, 3×6), మిల్లర్ (29; 38 బంతుల్లో 1×4, 1×6) పుణ్యమాని ఆ మాత్రం స్కోరు వచ్చింది. ఛేజింగ్ లో బంగ్లా తడబడింది. 7 వికెట్లకు 109 పరుగులే చేసింది. తౌఫిక్ హృదోయ్ (37) టాప్ స్కోరర్.
17 ఓవర్లకు స్కోరు 94. విజయానికి చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు, ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో తొలి రెండు బంతుల్లో 4 పరుగులు రాగా మూడో బంతికి జేకర్ అలీ (8) ఔటయ్యాడు. నాలుగో బంతికి సింగిల్ (బై) వచ్చింది. 2 బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా.. మహ్మదుల్లా కొట్టిన భారీ షాట్ ను లాంగాన్ బౌండరీ వద్ద మార్‌క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. చివరి బంతికి సింగిలే రావడంతో దక్షిణాఫ్రికా గెలిచేసింది.
బంగ్లాదేశ్‌పై కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఓ డీఆర్‌ఎస్ నిర్ణయం నెట్టింట చర్చకు దారితీసింది. దాని కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. సరిగ్గా ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కడం గమనార్హం.
చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాకు 27 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్‌లో బార్ట్ మన్ వేసిన రెండో బంతి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా ప్యాడ్లను తాకి స్టంప్స్ వెనుకగా బౌండరీకి వెళ్లింది. ఎల్బీకి అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. బంగ్లా డీఆర్‌ఎస్ కు వెళ్లగా నాటౌట్ అని తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పటికీ అప్పటికే ఆ బంతిని డెడ్ బాల్ గా పరిగణించడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్కోరుకు 4 పరుగులు కలపలేదు. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడాతో ఆ జట్టు ఓడిపోవడంతో ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమైంది.
ఐసీసీ (ICC Rules) రూల్‌బుక్‌లోని 3.7.1 ప్రకారం.. డీఆర్‌ఎస్ తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ఔట్.. నాటౌట్ గా మారినప్పటికీ మొదట తీసుకున్న డెడ్ బాల్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నాటౌట్ అని తేలితే బ్యాటింగ్ జట్టుకు వికెట్ మిగులుతుంది కానీ.. ఆ డెలివరీతో వచ్చే పరుగులు రావు. ఒకవేళ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం తీసుకుంటే మాత్ర ఆ పరుగులు లాభిస్తాయి.
ఇక, 3.7.2 ప్రకారం.. ఒరిజినల్ నిర్ణయం నాటౌట్ గా ఉండి.. డీఆర్‌ఎస్ లో ఔట్ అని వస్తే.. అప్పుడు బంతిని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అప్పటికే బ్యాటర్ పరుగులు చేసినా లెక్కలోకి తీసుకోరు.