ప్రపంచ కప్ "ముద్దు"తో .. సెల్ఫ్ గోల్
ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో క్రీడాకారిణిని ముద్దాడి సంచలనం రేపారు. ఈ సెల్ఫ్ గోల్ కు ఆయన మూల్యం చెల్లించుకున్నారు.
By: Tupaki Desk | 12 Sep 2023 5:36 AM GMTప్రపంచ కప్ గెలవడం అంటే ఏ క్రీడలోనైనా గొప్ప సంబరమే.. అందులోనూఫుట్ బాల్ వంటి మహా క్రేజ్ ఉన్న క్రీడలో అయితే ప్రపంచాన్నే జయించినంత వేడుక. ఈ నేపథ్యంలోనే ఫుట్ బాల్ క్రీడాకారులు కప్ లు గెలిచిన సందర్భంలోఘనంగా సంబరాలు చేసుకుంటారు. వాస్తవానికి ఫుట్ బాల్ క్రీడలో కెప్టెన్, ఆటగాళ్ల పాత్ర పరిమితం అనే సంగతి మీకు తెలుసా? కెప్టెన్ కేవలం ఒక ప్రధానఆటగాడనే విషయం తెలుసా? ఎందుకంటే ఫుట్ బాల్ లో అంతా 'మేనేజర్-కోచ్' దే పెత్తనం.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. నిరుడు జరిగిన పురుషుల ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను కీలక మ్యాచ్ లో కోచ్ పక్కనపెట్టడమే. ఇక ఇప్పటి విషయానికి వస్తే స్పెయిన్ మహిళల ఫుట్ బాల్ కోచ్.. ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో క్రీడాకారిణిని ముద్దాడి సంచలనం రేపారు. ఈ సెల్ఫ్ గోల్ కు ఆయన మూల్యం చెల్లించుకున్నారు.
ఫిఫా మహిళల ప్రపంచకప్ ను గత నెలలో స్పెయిన్ చేజిక్కించుకుంది. ఈ టైటిల్ కొట్టడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. ఆ పట్టరాని ఆనందంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ క్రీడాకారిణిని ముద్దాడి.. ఇప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. బహిరంగంగా ముద్దు పెట్టడంపై మొదట్లోనే వివాదం రేగగా స్పెయిన్ ప్రధాని కల్పించుకున్నారు. అప్పుడే పదవి నుంచి సస్పెండైన ఫెడరేషన్ చీఫ్.. ప్రస్తుతం రాజీనామాను సమర్పించారు.
స్టార్ ప్లేయర్ ను చుంబించి..మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఆగస్టు నెలలో సిడ్నీలో జరిగింది. ఫైనల్ లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించాడు.
స్టార్ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోసోను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలనూ ముద్దాడాడు. ఇదంతా వైరల్‌గా మారడంతో స్పెయిన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ వివాదంతో స్పెయిన్ చాంపియన్ ఆనందం కొన్ని రోజులకే ఆవిరైంది. ''జెన్నిఫర్ అనుమతితోనే నేను ఆమెను ముద్దాడాను'' అని లూయీస్ చెప్పగా, తాను ఒప్పుకోలేదని ఆమె బదులిచ్చింది.
రంగంలోకి ఫిఫా క్రీడాకారిణులకు ముద్దు వివాదంపై మరింద ముదరడంతో తొలుత స్పెయిన్ ప్రధాని కలగజేసుకున్నారు. లూయీస్ తో వివరణ ఇప్పించారు. కానీ, అది చివరకు ఫిఫా వరకు వెళ్లింది. తాజాగా లూయీస్ పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి అతడు రాజీనామా ప్రకటించాడు. 'ఫిఫా నిర్ణయం, నాపై నమోదైన కేసుల కారణంగా.. ఈ పదవిలోకి తిరిగిరాలేనని స్పష్టమవుతోంది' అంటూ లేఖలో వెల్లడించాడు. కాగా, లూయీస్ 2018లో ఫెడరేషన్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవితో పాటు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలనుంచి కూడా వైదొలిగాడు.