Begin typing your search above and press return to search.

ఎజాజ్ ''పదే'' ల్.. స్వదేశంలో నిల్.. విదేశాల్లో హిట్..

భారత సంతతి క్రికెటర్లు అత్యధికంగా ప్రానిధ్యం వహించిన దేశం పేరు చెప్పండి అంటే.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా.. ముందుగా గుర్తొస్తాయి

By:  Tupaki Desk   |   11 Dec 2023 2:30 PM GMT
ఎజాజ్ పదే ల్.. స్వదేశంలో నిల్.. విదేశాల్లో హిట్..
X

భారత సంతతి క్రికెటర్లు అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన దేశం పేరు చెప్పండి అంటే.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా.. ముందుగా గుర్తొస్తాయి. కానీ, ఇవేవీ కాదు. ఒకప్పటి జీతన్ పటేల్ నుంచి ప్రస్తుత ఎజాజ్ పటేల్ వరకు ప్రాతినిధ్యం వహించిన దేశం న్యూజిలాండ్. ఇంకా బాగా చెప్పాలంటే తాజా సంచలనం రచిన్ రవీంద్ర ఆడుతున్న దేశం న్యూజిలాండ్. ఇస్ సోథి వంటి స్పిన్నర్ కూడా కివీస్ కు కీలకంగా మారాడు. అయితే, వీరిలో ఎజాజ్ పటేల్ ది కొంత ప్రత్యేకత.

పదికి పది తీసిన మూడో వాడు

టెస్టు క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొడితేనే బౌలర్ ఉబ్బితబ్బిబ్బై పోతాడు. ఇక పదికి పదికి పది తీశాడంటే అతడిని ఆకాశానికి ఎత్తాల్సిందే. అసలు ఇదొక అరుదైన ఘనత. ఎందుకంటే అసాధారణ ప్రతిభతో రెండు ఇన్నింగ్స్ ల్లో పది వికెట్లు తీయొచ్చు కానీ.. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టడం అంటే అన్నీ కలిసిరావాలి. 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీ ధరన్ కు గానీ.. 700 వికెట్లు పడగొట్టిన షేన్ వార్న్ కు గానీ సాధ్యం కాని ఫీట్ ఇది. అయితే, భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రం ఆ రికార్డును అందుకున్నాడు. 1999లో పాకిస్థాన్ పై ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసి అపురూప ఘనతను ఒడిసిపట్టాడు. అంతకుమందు ఈ రికార్డు జిమ్ లేకర్ (ఇంగ్లండ్) పేరిట ఉంది.

మన మీదే ఆ ఘనత

రెండేళ్ల కిందట ముంబైలో భారత్ తో జరిగిన టెస్టులో ఎజాజ్ పటేల్ పదికి పది వికెట్లు తీశాడు. అయితే, ఎజాజ్ గురించి చెప్పాల్సి వస్తే.. కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 టెస్టు మ్యాచులు ఆడాడు. 29.75 స‌గ‌టుతో 62 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అత్యుత్త‌మ బౌలింగ్ భారత్ పైనే (119 ప‌రుగులకు 10 వికెట్లు). న్యూజిలాండ్ కు శాంటర్న్ తర్వాత టెస్టులో రెండో ప్రధాన స్పిన్నర్ అయిన ఎజాజ్.. తీసిన 62 వికెట్లూ ఉప‌ఖండ‌లోని శ్రీలంక‌, భార‌త్‌, బంగ్లాదేశ్‌ తో పాటు యూఏఈ లోనే కావ‌డం గ‌మ‌నార్హం. స్వ‌దేశంలో వెల్లింగ్ట‌న్‌, క్రైస్ట్‌చ‌ర్చ్‌ల‌లో మూడు టెస్టులు ఆడి 49 ఓవ‌ర్లు వేశాడు. వాటిలో ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేక‌పోయాడు.

మరెప్పుడు తీస్తాడో..?

ఎజాజ్ పటేల్ ప్రస్తుత వయసు 35. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆల‌స్యంగా వచ్చాడు. 2018లో అతడికి 30 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు పాకిస్తాన్‌ పై అరంగేట్రం చేశాడు. అదే మ్యాచ్ లో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మరోవైపు బంగ్లాదేశ్‌ తో శనివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఎజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను గెలిపించాడు. ఎవరైనా బౌలర్ సొంతగడ్డపై రాణించి.. విదేశాల్లో విఫలం అవుతుంటాడు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు. కానీ.. ఎజాజ్ పటేల్ ది మాత్రం భిన్నమైన స్టోరీ.