హైదరాబాద్ వర్సెస్ చెన్నై... "రైజింగ్" మామూలుగా లేదు!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా అత్యంత హాట్ మ్యాచ్ జరిగింది.
By: Tupaki Desk | 6 April 2024 4:07 AM GMTఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా అత్యంత హాట్ మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా... చెన్నై సూపర్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ కు హైదరాబాద్ వేదికైంది. దీంతో... గత మ్యచ్ లు ఓడిపోయిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే... గాయపడిన రెండు సింహాలు తలపడే తరహాలో ఈ మ్యాచ్ ఉంటుందని భావించారు కూడా. అయితే సన్ రైజర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో వార్ వన్ సైడ్ అయ్యిందన్నట్లుగా ఈ మ్యాచ్ సాగిందనే చెప్పాలి! అది ఎలానో ఇప్పుడు చూద్దాం...!
చెన్నైతో మ్యాచ్ లో టాస్ నెగ్గిన హైదరాబాద్... బౌలింగ్ ఎంచుకుంది. దీంతో... రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ లు బరిలోకి దిగారు.
చెన్నై బ్యాటింగ్ స్టార్ట్!:
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కాస్త స్లోగానే స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా... అభిషేక్ వేసిన తొలిఓవర్లో 7 పరుగులు వచ్చాయి. అనంతరం భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్ లో 6 పరుగులు వచ్చాయి. దీంతో... చెన్నై స్కోరు రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.
భువీ మ్యాజిక్... చెన్నై ఫస్ట్ వికెట్ డౌన్!:
చెన్నై సూపర్ కింగ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కు ఈ సీజన్ లో తొలి వికెట్ దక్కింది. రచిన్ (12) ను భువీ పెవిలియన్ కు పంపాడు. పైగా ఈ ఓవర్ లో ఒక్కపరుగే ఇచ్చాడు. దీంతో... 4 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు ఒక వికెట్ నష్టానికి 33 పరుగులుగా ఉంది!
పవర్ ప్లే ముగిసేనాటికి పరిస్థితి ఇది!:
కాస్తా స్లోగానే మొదలుపెట్టినా.. మెల్లమెల్లగా దూకుడు పెంచింది చెన్నై. ఒక వికెట్ కోల్పోయినా.. రుతురాజ్ (23*) రహానె (13*) దూకుడుగా ఆడటంతో ఆరు ఓవర్లకు 48 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై!:
ఫుల్ ఫాం లో ఉన్న రచిన్ రవీంద్ర ఔట్ అవ్వడంతో కాస్త స్లో అయినట్లు కనిపిస్తున్న పరిస్థితుల్లో.. షహ్బాజ్ వేసిన ఎనిమిదో ఓవర్ తొలిబంతికి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన శివమ్ దూబె... వచ్చీ రాగానే ఫోర్, సిక్స్ బాదాడు! దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 65కు చేరుకుంది.
సగం ఓవర్లు ముగిసే సరికి చెన్నై పరిస్థితి ఇది!:
అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ క్రమంలో పాట్ కమిన్స్ వేసిన పదో ఓవర్ లో కేవలం నాలుగే పరుగులు రావడంతో... సగం ఓవర్లు పూరయ్యే సరికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులకు చేరుకుంది!
హాఫ్ సెంచరీ మిస్... శివమ్ దూబె ఔట్!:
దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబె 45 (24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ లు) ను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. 14 ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో... 14 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన చెన్నై స్కోరు 120 పరుగులుగా ఉంది.
చెన్నై నాలుగో వికెట్ డౌన్!:
సన్ రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో చెన్నై బ్యాటర్స్ ఉక్కికిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో జయ్ దేవ్ వేసిన 15 ఓవర్ ఆఖరు బంతికి అజింక్యా రహానే (35) ఔటయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూరయ్యే సరికి చెన్నై స్కోరు 4 వికెట్లకు 127 పరుగులకు చేరింది.
ఐదో వికెట్ డౌన్.. ధోనీ ఇన్!:
సన్ రైజర్స్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలో... నటరాజన్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి డారిల్ మిచెల్ (13) ఔటయ్యాడు. దీంతో... ధోనీ క్రీజ్ లోకి వచ్చాడు. దీంతో... మైదానం అంతా ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో హోరెత్తింది.
హైదరాబాద్ విజయ లక్ష్యం 166 పరుగులు:
చివరి ఓవర్ లో ధోనీ బ్యాటింగ్ కు వచ్చి ఒక్క పరుగు మాత్రమే చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇదే సమయంలో రవీంద్ర జడేజా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు! నటరాజన్ వేసిన ఈ ఓవర్ లో కేవలం 7 పరుగులే వచ్చాయి. దీంతో... చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
హైదరాబాద్ ప్రారంభించింది!:
చెన్నై నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్ లక్ష్యంగా ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వచ్చారు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్ లో 8 పరుగులు వచ్చాయి. ఇక ముకేశ్ చౌదరి వేసిన రెండో ఓవర్ లో అభిషేక్ శర్మ మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో... రెండు ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 35 పరుగులకు చేరింది.
సన్ రైజర్స్ తొలివికెట్ డౌన్!:
దీపక్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ కొట్టేందుకు అభిషేక్ శర్మ (37: 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు) ఔటయ్యాడు. ఉన్నంత సేపూ హోరెత్తించి.. బౌండరీ లైన్ వద్ద జడేజా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ కు చేరాడు. దీంతో... 3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 46 పరుగులకు చేరింది.
పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ పరిస్థితి ఇది!:
4వ ఓవర్ లో 11 పరుగులు, 5వ ఓవర్ లో 7 పరుగులు, 6 ఓవర్లో 14 పరుగులు రావడంతో.. పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన హైదరాబాద్ 78 పరుగులు చేసింది. దీంతో... హైదరాబాద్ విజయానికి 84 బంతుల్లో 88 పరుగులు కావాలి!
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్!:
తీక్షణ వేసిన పదో ఓవర్ 4వ బంతికి ట్రావిస్ హెడ్ (31) ఔటయ్యాడు. ఈ ఓవర్ లో ఆరు పరుగులు రాగా.. ప్రస్తుతం హైదరబాద్ స్కొరు సగం ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులకు చేరింది.
మార్క్రమ్ హాఫ్ సెంచరీ.. ఔట్!:
మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మొయిన్ అలీ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. ఇలా.. 132 పరుగుల వద్ద హైదరాబాద్ మూడో వికెట్ ను కోల్పోయింది. దీంతో 14 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 132 పరుగులకు చేరింది.
షహ్బాజ్ ఔట్!:
హైదరాబాద్ గెలుపు లాంఛనమే అని అనుకుంటున్న దశలో వరుసగా వికెట్లు పడ్డాయి. మొయిన్ అలీ వేసిన 16 ఓవర్ 4 బంతికి షహ్బాజ్ (18) ఔటయ్యాడు. దీంతో 141 పరుగుల వద్ద హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇప్పుడు సన్ రైజర్స్ కి 26 బంతుల్లో 25 పరుగులు అవసరం.
హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం!:
17వ ఓవర్ లో ఫోర్ సహా 8 పరుగులు, 18వ ఓవర్ లో 9 పరుగులు రావడంతో... హైదరాబాద్ కు ఇంక 12 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే అవసరం పడింది. దీంతో 19 ఓవర్ తొలిబంతికి నితిష్ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం నమోదైంది!