Begin typing your search above and press return to search.

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ బాయ్ కాట్.. శ్రీలంకకు జాక్ పాట్..

క్రికెట్ లో ఐసీసీ టోర్నీలంటే వన్డే, టి20 ప్రపంచ కప్ లు, టెస్టు చాంపియన్ షిప్.

By:  Tupaki Desk   |   13 July 2024 5:30 PM GMT
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ బాయ్ కాట్.. శ్రీలంకకు జాక్ పాట్..
X

క్రికెట్ లో ఐసీసీ టోర్నీలంటే వన్డే, టి20 ప్రపంచ కప్ లు, టెస్టు చాంపియన్ షిప్. ఇది కాక మరో టోర్నీ కూడా ఉంది. అది చాంపియన్స్‌ ట్రోఫీ. మీకు తెలుసో లేదో..? ఇటీవలి టి20 ప్రపంచ కప్ కాకుండా భారత్ చివరిసారిగా గెలిచిన ఐసీసీ ట్రోఫీ ఇదే. 2013లో ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ను ఓడించి కప్ కొట్టేసింది టీమ్ ఇండియా.

ఏడున్నరేళ్ల తర్వాత

చాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017 జూలైలో జరిగింది. అప్పట్లో పాకిస్థాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోయింది. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిపై పాక్‌ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్‌ ను ఐసీసీకి ఇచ్చింది. భారత్‌ ఆడే మ్యాచ్‌ లకు లాహోర్ స్టేడియాలను కేటాయించారు. కానీ, దీనికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆమోదం తెలపలేదు. ఎందుకంటే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేవరకు పాకిస్థాన్ లో పర్యటించేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. కాగా.. భద్రతా పరమైన కారణాలతో కూడా పాక్ లో భారత జట్టు పర్యటించడం లేదు.

పాకిస్థాన్ పట్టుబడితే..

తమ దేశంలో భారత్ పర్యటించడం లేదు కాబట్టి భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఆడేది లేదంటూ పాకిస్థాన్ భీష్మించింది. చివరకు టోర్నీలో పాల్గొంది. కాగా, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో గనుక భారత్ పాల్గొనకుంటే ఏం చేస్తుందో చూడాలి. దీనిపై మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆసియా కప్‌ తరహాలోనే చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌ లో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరుతోంది. అంటే.. భారత మ్యాచ్‌ లను వేరేచోటకు తరలించి.. మిగతా దేశాల మ్యాచ్ లను పాక్‌ లో ఆడేలా చేయడం. భారత్ ఆడే మ్యాచ్ లను శ్రీలంక లేదా దుబాయ్‌ కి మార్చాలని బీసీసీఐ కోరుతోంది.

భారత్ ఆడకుంటే..

ఎనిమిది జట్లతో కూడిన చాంపియన్స్ టోర్నీ ఈ సారి వన్డే ఫార్మాట్‌ లో జరగనుంది. పాకిస్థాన్ లో వేదికలను మార్చకుంటే భారత్ పాల్గొనే చాన్స్ ఉండదు. అదే జరిగితే.. శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. చాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్-8 జట్లకే అర్హత ఉంటుంది. శ్రీలంక ర్యాంకింగ్స్ లో కింద ఉండడంతో చాన్స్ దొరకలేదు. అదే భారత్ వైదొలగితే.. లంకకు అవకాశం చిక్కుతుంది.