Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్... శ్రీలంక ఆటగాడిపై ఫిక్సింగ్ ఆరోపణలు!

అవును... ఫిక్సింగ్ కు ప్రయత్నించాడంటూ శ్రీలంక స్పిన్ బౌలర్ జయవిక్రమపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అభియోగాలు మోపింది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:37 PM GMT
మేటర్  సీరియస్... శ్రీలంక ఆటగాడిపై ఫిక్సింగ్  ఆరోపణలు!
X

ఇటీవల కాలంలో పెద్దగా వినిపించని మాటలు మళ్లీ క్రికెట్ ప్రపంచంలో తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా శ్రీలంక ఆటగాడిపై ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి నిరోధక కోడ్ ను ఉల్లంఘించారనే అభియోగాలు మోపింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఫిక్సింగ్ కు ప్రయత్నించాడంటూ శ్రీలంక స్పిన్ బౌలర్ జయవిక్రమపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అభియోగాలు మోపింది. ఈ మేరకు ఆగస్టు 8 గురువారం ఆ వివరాలు ప్రకటించింది. ఈ అభియోగాలు ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు 2021లో లంక ప్రీమియర్ లీగ్ (ఎల్.పీ.ఎల్) సీజన్ రెండింటికీ సంబంధించినవని తెలిపింది.

ఈ సందర్భంగా అతడు కోడ్ లను ఉల్లంఘించారని ఆరోపించింది ఐసీసీ. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు జయవిక్రమకు ఆగస్ట్ 6 నుంచి 14 రోజుల పాటు (ఆగస్ట్ 20 వరకూ) గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అతడిపై మోపబడిన అభియోగాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆర్టికల్ 2.4.4.: 2021 లంక ప్రీమియర్ లీగ్ లో ఓ బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని అవినీతి నిరోధక విభాగానికి తెలియపరచలేదు.

ఆర్టికల్ 2.4.7: అవినీతి ప్రవర్తనకు సంబంధించిన విచారనకు మెసేజ్ లను డిలీట్ చేయడం ద్వారా ఆటంకం కలిగించారు.

ఈ నేపథ్యంలో... ఆర్టికల్ 1.7.4.1, 1.8.1 ప్రకారం ఇంటర్నేషనల్ మ్యాచ్ ఛార్జీలతో పాటు లంక ప్రీమియర్ లీగ్ ఛార్జీకి సంబంధించి ఐసీసీ చర్యలు తీసుకుంటుందని.. ఈ మేరకు తమతోపాటు పాటు లంక బోర్డు నిర్ణయించాయని ఐసీసీ వెళ్లడించింది.

కాగా... 2021 మే లో శ్రీలంక తరుపున అరంగేట్రం చేసిన జయవిక్రమ.. ఐదేసి టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2022 జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనూ కనిపించాడు. అయితే.. 2022లో ఆసియా కప్ ను గెలుచుకున్న లంక టీంలో భాగమైనప్పటికీ... టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు!