Begin typing your search above and press return to search.

వన్డేలు మర్చిపోయారా? లంక చేతిలో దారుణ పరాజయం 27 ఏళ్లలో తొలిసారి

టి20 ప్రపంచ కప్ గెలిచిన ఊపులో శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాకు గట్టి షాక్.

By:  Tupaki Desk   |   7 Aug 2024 6:32 PM GMT
వన్డేలు మర్చిపోయారా? లంక చేతిలో దారుణ పరాజయం 27 ఏళ్లలో తొలిసారి
X

మొదటి మ్యాచ్ టైగా ముగిసింది.. లేదంటే 03తో క్లీన్ స్వీప్ అయి పరువు పోయేది.. వాస్తవానికి నిజమైన ఫలితం కూడా 0-3 అనే అనుకోవాలి. వన్డే ప్రపంచ కప్ లో కనీసం ప్రదర్శన చేయలేకపోయిన జట్టుపై ఫైనలిస్ట్ అయిన టీమ్ ఇండియా కనీస ప్రదర్శన చేయలేకపోయింది. ఇది అత్యంత బాధాకరం. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మొట్టమొదటే గట్టి షాక్. మరి దీన్నుంచి పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

వన్డేలు ఆడడం ఇలానా?

టి20 ప్రపంచ కప్ గెలిచిన ఊపులో శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాకు గట్టి షాక్. టి20ల్లో ఆ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. కుర్రాళ్లతో కూడినప్పటికీ మెరుగైన జట్టు అనిపించుకుంది. కానీ, వన్డే సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమైంది. అసలు వన్డేలు ఆడడమే మర్చిపోయినట్లుగా కనిపించింది. పైగా రెస్ట్ తీసుకుంటామని చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను పిలిపించి మరీ ఆడించారు. కానీ, 0-2తో ఓటమి ఎదుర్కొన్నారు. తొలి వన్డేలో 230, రెండో వన్డేలో 240, మూడో వన్డేలో 248 పరుగుల టార్గెట్ ఛేదించలేకపోయింది. ఏడుగురు కాదు ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలో దిగినా ఒక్క వన్డేనూ గెలవలేకపోవడం విచిత్రం. బుధవారం జరిగిన మూడో వన్డేలో అయితే 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిది కూడా సగం (26.1) ఓవర్లే. తొలి వన్డే టై అయింది. అయితే, వాస్తవానికి అందులో శ్రీలంకదే పైచేయి. లేదంటే 0-3తో సిరీస్ స్వీప్ అయినట్లే లెక్క. వాస్తవానికి లంక స్పిన్నర్లు సాధారణమైన వారే. కానీ, వారిని ఆడలేక చేతులెత్తేసింది రోహిత్ శర్మ టీమ్. అసలు రోహిత్ తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా ఫామ్ లో లేడు. కోహ్లి, అయ్యర్, గిల్, రాహుల్ అంతా తుస్ అనిపించారు. శివమ్ దూబె కూడా ఇంతే.

1997 తర్వాత ఇప్పుడే..

శ్రీలంక 27 ఏళ్ల తర్వాత భారత్‌ పై వన్డే సిరీస్‌ నెగ్గడం ఇప్పుడే మొదటిసారి. 1997లో అర్జున రణతుంగ ఆధ్వర్యంలోని లంక 3-0తో భారత్ ను ఓడించింది. అప్పటినుంచి భారత్ వరుసగా పది వన్డే సిరీస్ లు గెలిచింది. ఒకటి డ్రా అయింది. ఇక్కడ అసలు విషయం ఏమంటే.. 1997లో భారత్ కంటే కాస్త మెరుగ్గా కనిపించింది లంక. ఇప్పుడు మాత్రం రెండు జట్ల మధ్య చాలా తేడా ఉంది. కానీ, ఫలితం మాత్రం భిన్నం.

గంభీర్ కు డేంజర్ బెల్

కొత్త హెడ్ కోచ్ గంభీర్ కు లంక టూర్ పెద్ద గుణపాఠం. బుమ్రా, హార్దిక్ తప్ప ప్రధాన జట్టుతోనే బరిలో దిగినా లంక వంటి టీమ్ చేతిలో ఓడిపోవడం షాకింగే. టి20 సిరీస్ లో సెంచరీ బాదిన యశస్వి జైశ్వాల్ ను వద్దని.. గిల్ ను ఓపెనింగ్ కు పంపడం, మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లను వెనకేసుకొచ్చిన గంభీర్ వారి వైఫల్యాలకు బాధ్యుడు అనే చెప్పాలి. టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ నూ ఇష్టారీతిన మార్చాడు. మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. అక్షర్ రాణించడంతో సరిపోయింది. లేదంటే మరిన్ని విమర్శలు వచ్చేవి. ఏది ఏమైనా.. కోచింగ్ స్టాఫ్, జట్టు ఆటగాళ్ల విషయంలో గంభీర్ ముక్కుసూటిగా వెళ్లి పంతం నెగ్గించుకున్నాడు. వన్డే సిరీస్ మాత్రం చేజారింది. మున్ముందు దీనిని ఓ ప్రమాద హెచ్చరికగానే చూడాలి.