ఐపీఎల్-18: వీరిని ఎప్పుడు చూస్తోమో..? కొందరిని చూడమేమో?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ముగిశాయి.
By: Tupaki Desk | 27 March 2025 4:30 PMనిబంధనల్లో అనేక మార్పులు.. మెగా వేలంలో సంచలనాలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ముగిశాయి. ఏడో మ్యాచ్ గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ -లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ లో జరగనుంది. కాగా, లీగ్ ఇంత రంజుగా నడుస్తున్నా కొందరు ఆటగాళ్లు ఇంకా బరిలో దిగలేదు. దీంతో వారు ఎప్పుడు వస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే అసలు రారేమో అనిపిస్తోంది.
పేస్ గుర్రం ఎక్కడ?
టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా జనవరి మొదటివారం లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ నుంచి అర్థంతరంగా తప్పుకొన్నాడు. ఎప్పటినుంచో ఉన్న వెన్ను గాయం తిరగబెట్టడంతో అతడు దాదాపు మూడు నెలలుగా మైదానంలోకి దిగలేదు. చాంపియన్స్ ట్రోఫీ వంటి కీలకమైన సిరీస్ కూ దూరమయ్యాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడే బుమ్రా ఇంకా జట్టుతో కలవలేదు. అతడు కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇంకెప్పుడు బరిలో దిగుతాడో..?
గత ఏడాది ముంబై ఏరికోరి తెచ్చుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తో లీగ్ తొలి మ్యాచ్ లో ఆడలేదు.
గత ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న టీమ్ ఇండియా సీనియర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ ఈ ఏడాది వదులుకుంది. ఇప్పుడు అతడు ఢిల్లీకి ఆడనున్నాడు. అయితే, తండ్రి కావడంతో రాహుల్.. తన తాజా మాజీ జట్టు లక్నోతో జరిగిన తొలి మ్యాచ్ కు అందుబాటులో లేడు. రెండో మ్యాచ్ కు అతడు వస్తాడేమో చూడాలి
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గత ఏడాది 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసి దుమ్మురేపాడు సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ అగర్వాల్. అతడిని ఈ ఏడాది లక్నో అట్టిపెట్టుకుంది. నిరుడు రెండు, మూడు మ్యాచ్ లలో మాత్రమే బౌలింగ్ చేసిన మయాంక్ ఆ తర్వాత గాయంతో తప్పుకొన్నాడు. ఆ సీజన్ లో మళ్లీ బరిలో దిగలేదు.. ఈ సీజన్ లో ఇప్పటివరకు కూడా.
కోల్ కతా తరఫున బరిలో దిగాల్సి ఉన్న జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా గాయంతో తప్పుకొన్నాడు. లక్నో పేసర్ మొహిసిన్ ఖాన్ కూడా గాయంతో దూరమయ్యాడు.
విదేశీయుల విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకొన్న మొదటి ఆటగాడు. ఇక ఇంగ్లండ్ విధ్వంసక బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకొని రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్ కు చెందిన బ్రైడాన్ కార్సె, దక్షిణాఫ్రికా బౌలర్ లిజార్డ్ విలియమ్స్ కూడా లీగ్ మొదలవడానికి ముందే గాయాలతో తప్పుకొన్నారు.