Begin typing your search above and press return to search.

ఐపీఎల్ అంకుల్స్ ఆర్మీ.. చెన్నై ఔట్ డేటెడ్ గేమ్.. కోచ్ లోనూ అసహనం

చెన్నై గురించి ఉన్న మరో కామెంట్.. ’అంకుల్స్ ఆర్మీ’ అని.. ఇది ఇప్పుడే కాదు.. ఐదారేళ్లుగా వినిపిస్తున్న మాట. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతోనే చెన్నైపై ఈ కామెంట్ వస్తోంది.

By:  Tupaki Desk   |   29 March 2025 2:30 PM
Stephen Fleming On CSK VS RCB Match
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏది..? అందరూ ఎక్కువగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు పేర్లూ చెబుతారు. కానీ, మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజం నాయకత్వంలో చెన్నై ఎదురులేని జట్టుగా ఎదిగింది. అయితే, చెన్నై ఏమీ భారీ రేట్లు పెట్టి మేటి ఆటగాళ్లను తెచ్చుకోలేదు.. ఉన్న వనరుల్లోనే ఆటగాళ్లను మేటిగా తీర్చిదిద్దుకుంది. సాధారణ ఆటగాళ్లు కూడా చెన్నై జట్టుతో చేరితే మేటి ఆటగాడిగా మారతారు.. టీమ్ ఇండియా తలుపు తడతారు.. దీనికి చాలా ఉదాహరణలున్నాయి.

చెన్నై గురించి ఉన్న మరో కామెంట్.. ’అంకుల్స్ ఆర్మీ’ అని.. ఇది ఇప్పుడే కాదు.. ఐదారేళ్లుగా వినిపిస్తున్న మాట. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతోనే చెన్నైపై ఈ కామెంట్ వస్తోంది. ఓ దశలో ధోనీతో పాటు చెన్నై జట్టులో డుప్లెసిస్, అంబటి రాయుడు, షేన్ వాట్సన్ ఇలా చాలామంది 30 ఏళ్లు దాటినవారే ఉండేవారు. అయినా వీరితోనే ఆ జట్టు టైటిల్స్ కొట్టింది. ప్రస్తుత జట్టులోనూ జడేజా, శివమ్ దూబె, రాహుల్ త్రిపాఠి, రవిచంద్రన్ అశ్విన్ 30 పైబడినవారే. జడేజా, అశ్విన్ 35 దాటారు కూడా. ఇక ధోనీ 44 ఏళ్లకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు చెన్నైపై వస్తున్న మరో విమర్శ.. ఆ జట్టు గేమ్ ఔట్ డేటెడ్ అని. ఇదే ప్రశ్న చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను ఓ జర్నలిస్టు అడిగాడు. ఆగ్రహానికి గురైన అతడు జర్నలిస్టు వాదననున కొట్టిపడేశాడు.

ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో 156 పరుగుల టార్గెట్‌ను 20వ ఓవర్‌ దాకా ఛేదించలేకపోవడం, శుక్రవారం బెంగళూరుపై 146 పరుగులే చేయడం ఔట్‌ డేట్‌ గా అనిపించడం లేదా ? అని ఫ్లెమింగ్ ను జర్నలిస్టు అడిగాడు. దీనికి అతడు స్పందిస్తూ తమను తక్కువ అంచనా వేయొద్దని, పాజిటివ్ గేమ్ తమ విధానమని చెప్పుకొచ్చాడు. తమలో ఫైర్ పవర్ తగ్గలేదన్నట్లు మాట్లాడాడు.

వాస్తవానికి చెప్పాలంటే చెన్నై టీమ్ లో ఇదివరకటి జోష్ లేదు. నిన్నటి మ్యాచ్ లో సొంతగడ్డపై పరుగులు సాధించలేకపోయింది. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా బెంగళూరు చేతిలో ఓడింది. రచిన్ రవీంద్ర తప్ప మిగతవారంతా తేలిపోయారు. కెప్టెన్ రుతురాజ్, దీపక్ హుడా మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. 34 ఏళ్ల రాహుల్ త్రిపాఠి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవడం లేదు. వెరసి మంచి బ్యాటింగ్ లైనప్ కనిపించడం లేదు. వెటరన్ ధోనీ 8వ స్థానంలో దిగడం ఎవరికీ నచ్చడం లేదు. బౌలింగ్ లోనూ పసలేకపోవడంతో చెన్నైలో జోష్ కనిపించడం లేదు. మున్ముందు ఇదే విధంగా ఆడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. దిగ్గజం ధోనీకి గొప్పగా వీడ్కోలు పలకాలన్న లక్ష్యమూ నెరవేరదు.