స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. టాప్-4లో ఒకరు ఔట్
ఇప్పుడు ఈ నలుగురిలో ఒక వికెట్ పడిపోయింది. ఆస్ట్రేలియా మేటి ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు.
By: Tupaki Desk | 5 March 2025 1:34 PM ISTటీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ క్రికెట్ మూల స్తంభం జో రూట్.. న్యూజిలాండ్ క్లాస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. వీరి సరసన నిలిచే ఒకే ఒక ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఈ నలుగురూ ప్రపంచ క్రికెట్ లో సమకాలికులు.. అంతేకాదు.. అందరూ 2008 అండర్ 19 ప్రపంచ కప్ లో తమతమ దేశాలకు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ కు వచ్చాక నలుగురూ దిగ్గజాలుగా ఎదిగారు. ఫ్యాబ్-4గా ముద్రపడ్డారు.
ఇప్పుడు ఈ నలుగురిలో ఒక వికెట్ పడిపోయింది. ఆస్ట్రేలియా మేటి ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో మంగళవారం భారత చేతిలో పరాజయం అనంతరం స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, టి20ల్లో కొనసాగుతానని మాత్రం తెలిపాడు.
సరిగ్గా 15 ఏళ్ల కిందట 2010 ఫిబ్రవరిలో వన్డే అరంగేట్రం చేసిన స్మిత్.. 170 వన్డేలు ఆడాడు. 5,800 పరుగులు చేశాడు.
35 ఏళ్ల స్మిత్ మరికొన్నేళ్లు వన్డేలు ఆడే చాన్సున్నా రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
116 టెస్టుల్లో 10,271 పరుగులు చేసిన స్మిత్.. 67 టి20ల్లో 1094 పరుగులు చేశాడు. కొన్నాళ్లుగా స్మిత్ ను టి20లకు పెద్దగా పరిగణించడం లేదు. అంటే అతడు టెస్టుల్లో మాత్రమే కనిపించే చాన్సుంది.
స్పిన్నర్ గా వచ్చి..
షేన్ వార్న్ రిటైర్మెంట్ అనంతరం.. పాంటింగ్, వాట్సన్, క్లార్క్ వంటి మేటి ఆటగాళ్ల కాలంలో వన్డేల్లోకి వచ్చిన స్మిత్.. మొదట్లో ఫ్రంట్ లైన్ బ్యాటర్ కాదు. తొలి వన్డేలో అతడిని 8వ స్థానంలో చూపారు. ఈ మ్యాచ్ లో స్మిత్ కు అసలు బ్యాటింగ్ అవకాశమే రాలేదు. దిగ్గజ స్పిన్నర్ వార్న్ కు ప్రత్యామ్నాయంగానే స్మిత్ ను చూశారు. కానీ, కాలకమ్రంలో అతడు దిగ్గజ బ్యాటర్ గా ఎదిగాడు.
ఆస్ట్రేలియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గానూ ఎదిగాడు. అయితే, 2018నాటి దక్షిణాఫ్రికా టూర్ లో శాండ్ పేపర్ కుంభకోణంతో ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. తిరిగొచ్చాక కాస్త నిలకడ తగ్గినా.. మళ్లీ పుంజుకొన్నాడు.
స్మిత్ కాక ఫ్యాబ్ 4లో మిగతా ముగ్గురు కోహ్లి, విలియమ్సన్, రూట్. ఈ ముగ్గురూ 35 ఏళ్లు దాటినవారే. వీరు త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పే చాన్సుంది. కోహ్లి గత ఏడాదే టి20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రూట్ ను పొట్టి ఫార్మాట్ కు పరిగణించడం లేదు. వన్డేలకూ ఎంపిక చేస్తారని భావించలేం. ఇక విలియమ్సన్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. టి20లకు వీడ్కోలు చెప్పకున్నా ఎంపిక చేయడం కష్టమే.