Begin typing your search above and press return to search.

ప్రముఖ క్రికెటర్ కన్నుమూత.. సహచరుల సంతాపాలు.. అంతా తూచ్!

అయితే, అదే ఒలాంగో.. చివరకు మరో ట్వీట్ చేశాడు. అది.. "స్ట్రీక్ బతికే ఉన్నాడని.." అంతేకాక వదంతులను నమ్మొద్దు.. స్ట్రీక్ సజీవం అని పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 7:58 AM GMT
ప్రముఖ క్రికెటర్ కన్నుమూత.. సహచరుల సంతాపాలు.. అంతా తూచ్!
X

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సమాచారం వేగంగా విస్తరిస్తోంది. అందులో నిజానిజాలు నిర్ధారించుకునే లోపే అందరికీ చేరిపోతోంది. అంతా బాగుంటే ఓకే.. కానీ, అటుఇటు అయితేనే ఇబ్బంది. ముఖ్యంగా ప్రముఖుల మరణాల విషయంలో.. ఇటవల ఓ సినీ ప్రముఖుడు చనిపోయాడంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిందాక అవి ఆగలేదు. అలాంటి పరిస్థితే తాజాగా ఓ ప్రముఖ క్రికెటర్ విషయంలో ఎదురైంది.

ఇప్పుడంటే జింబాబ్వే క్రికెట్ పతనమైంది కానీ.. 20 ఏళ్ల కిందటి వరకు ఆ జట్టు బలమైనదే. మంచి పేస్ బౌలింగ్.. మెరికల్లాంటి ఆల్ రౌండర్లు, మేటి బ్యాట్స్ మెన్ తో ఆ జట్టు సంచలన ప్రదర్శనలు చేసేది. భారత్ వంటి జట్లకే కొన్నిసార్లు షాకిచ్చింది. అయితే, జింబాబ్వే పూర్తిగా ఆఫ్రికా దేశమైనప్పటికీ అక్కడ తెల్లవారిదే పెత్తనం. జాత్యంహకారం బాగా ఎక్కువ కూడానూ. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ ముగాబే హయాంలో దేశం మరింత పతనమైంది. ఆ ప్రభావం క్రికెట్ పైనా పడింది. క్రమంగా జింబాబ్వే జట్టు బలహీనపడింది. ఆటగాళ్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారు.

సువర్ణాధ్యాయంలో ఆ క్రికెటర్

జింబాబ్వే క్రికెట్ లో 1990-2005 వరకు సువర్ణాధ్యాయంగా చెప్పొచ్చు. ఆ కాలంలో ఫ్లవర్ సోదరులు ఆండీ, గ్రాంట్, పేస్ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్, పేసర్ హెన్రీ ఒలాంగా, గై విటల్, క్యాంప్ బెల్ వంటి మంచి ఆటగాళ్లు ఉండేవారు. వీరికి కెప్టెన్ స్ట్రీక్. ఇతడి సారథ్యంలో జింబాబ్వే మెరుగైన జట్టుగా ఎదిగింది. ప్రపంచ కప్ లలోనూ చక్కటి ప్రదర్శన చేసింది. అయితే, ఈ ఆటగాళ్లంతా రిటైరైన సమయంలోనే.. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో జింబాబ్వే క్రికెట్ కుప్పకూలింది. కాగా, 2000లో కెప్టెన్ అయన స్ట్రీక్ 2005లో అంత‌ర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. అప్పటికి అతడికి 31 ఏళ్లే. కానీ, దేశ పరిస్థితుల రీత్యా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, టెస్టుల్లో 100, వ‌న్డేల్లో 200 వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే బౌల‌ర్‌ స్ట్రీక్ మాత్రమే.

చనిపోయాడంటూ ఊహాగానాలు..

జింబాబ్వే కెప్టెన్ గానే కాక ఆల్ రౌండర్ గానూ మంచి రికార్డున్న స్ట్రీక్ చనిపోయాడంటూ పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. వాస్తవానికి స్ట్రీక్ వయసు 49 ఏళ్లే. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్ట్రీక్ మరణించాడంటూ సోషల్ మీడియాలో వచ్చింది. ఇంకేం..? పెద్దఎత్తున సంతాపాలు వెల్లువెత్తాయి. ఇలాంటివారిలో టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండడం గమనార్హం. సెహ్వాగ్ అయితే.. స్ట్రీక్ చాలా పోరాట స్ఫూర్తి ఉన్న క్రికెట‌ర్ అని, జింబాబ్వే ఉత్తమ ఆల్ రౌండ‌ర్ అని కొనియాడుతూ.. అతడి కుటుంబ‌స‌భ్యుల‌కు సంతాపం తెలిపాడు.

బతికే ఉన్నాడహో..?

స్ట్రీక్ చనిపోయినట్లు ప్రకంటించింది అతడి సహచరుడు ఒలాంగో. చాలా ఏళ్లు స్ట్రీక్ తో పాటు జట్టు తరఫున కొత్త బంతిని పంచుకున్న ఒలాంగో.. స్ట్రీక్ చనిపోయినట్లు ట్వీట్ చేశాడు. దీంతో అందరూ నమ్మేశారు. తెలుగులోని కొన్ని వెబ్ సైట్లు సైతం కథనాలు రాసేశాయి. అయితే, అదే ఒలాంగో.. చివరకు మరో ట్వీట్ చేశాడు. అది.. "స్ట్రీక్ బతికే ఉన్నాడని.." అంతేకాక వదంతులను నమ్మొద్దు.. స్ట్రీక్ సజీవం అని పేర్కొన్నాడు. దీన్ని చూసి అవాక్కయిన సెహ్వాగ్, అశ్విన్ తమ ట్వీట్లను ఉపసంహరించుకోవడం కొసమెరుపు. మరోవైపు స్ట్రీక్ -ఒలాంగో చాటింగ్ స్క్రీన్ షాట్లు తాజాగా బయటకు వచ్చాయి. "నేను బాగానే ఉన్నా. రనౌట్ (మరణ వార్త)ను వెనక్కుతీసుకో బడ్డీ" అంటూ ఒలాంగోను ఉద్దేశించి అతడు కోరినట్లు అందులో కనిపిస్తోంది. దీనికి ఒలాంగో కూడా అంతే సంతోషంగా స్పందించాడు. నీ మాటతో నాకు ఊపిరి వచ్చిందని పేర్కొన్నాడు.