600 టెస్టు వికెట్ల వీరుడు వైదొలగుతున్నాడు..
మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. తనలో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ.. వికెట్లు తీస్తున్నప్పటికీ.. ఇంగ్లాండ్ కీలక పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
By: Tupaki Desk | 30 July 2023 11:37 AM GMTమంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. తనలో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ.. వికెట్లు తీస్తున్నప్పటికీ.. ఇంగ్లాండ్ కీలక పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ చేతిలో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టించుకుని.. వన్డేల్లో పెద్దగా ఆడని బ్రాడ్ టెస్టుల్లో మాత్రం దిగ్గజ బౌలర్ గా మిగలనున్నాడు. 37 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం యాషెస్ లో తన 167వ టెస్టు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు అతడు ప్రకటించాడు. ఈ మేరకు శనివారం ప్రకటన చేశాడు. బ్రాడ్ ఇప్పటివరకు 602 టెస్టు వికెట్లు పడగొట్టాడు. 121 వన్డేల్లో 178 వికెట్లు పడగొట్టాడు. 56 టి20ల్లో 65 వికెట్లు తీశాడు.
లోయరార్డర్ లో ఉపయుక్త బ్యాట్స్ మన్
3647.. ఇవీ బ్రాడ్ టెస్టుల్లో చేసిన పరుగులు. ఓ పేసర్ ఇన్ని పరుగులు చేయడం గొప్పే. దీన్నిబట్టి అతడు ఉపయుక్త బ్యాట్స్ మన్ అని స్పష్టమవుతోంది. కాగా, టెస్టుల్లో బ్రాడ్ భారీ శతకం (169) బాదాడు. ఇదే అతడి ఏకైక సెంచరీ. 13 అర్ధ సెంచరీలు చేశాడు. మరో విశేషం ఏమంటే .. యాషెస్ సిరీస్ లో 150 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ బ్రాడ్. అంటే అతడు పడగొట్టిన ప్రతి నాలుగు టెస్టు వికెట్లలో ఒకటి యాషెస్ లోనిదే అన్నమాట.
మన కుంబ్లే స్థానం పదిలం
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ది 5వ స్థానం. మురళీ ధరన్ (శ్రీలంక-800), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా 708), అండర్సన్ (ఇంగ్లండ్ -691), అనిల్ కుంబ్లే (భారత్ 619) అతడి కంటే ముందున్నారు. కాగా, బ్రాడ్ రిటైరవ్వాలని నిర్ణయించుకోవడంతో కుంబ్లే రికార్డు ప్రస్తుతానికి పదిలం.