Begin typing your search above and press return to search.

4-2-4-2.. ఇదీ 43 ఏళ్ల పసికూన బౌలర్ ప్రపంచ రికార్డు

కెనడా, అమెరికా జట్లలో 16 మంది వరకు భారత సంతతి ఆటగాళ్లే ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 2:30 PM GMT
4-2-4-2.. ఇదీ 43 ఏళ్ల పసికూన బౌలర్ ప్రపంచ రికార్డు
X

అమెరికా/కరీబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ లో ఎన్నడూ లేని విధంగా 20 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో మనం గతంలో ఎన్నడూ చూడని దేశాల పేర్లూ ఉన్నాయి. పపువా న్యూ గినియా, ఉగాండా, నమీబియా, ఒమన్ తదితర దేశాలు ఉన్నాయి. స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటివి కాస్తోకూస్తో క్రికెట్ కల్చర్ ఉన్న దేశాలు. ఐర్లాండ్ గతంలో ఇంగ్లండ్ వంటి జట్టుకు షాకిచ్చింది.

కూనలే కానీ..

కెనడా, అమెరికా జట్లలో 16 మంది వరకు భారత సంతతి ఆటగాళ్లే ఉన్నారు. నేపాల్, నెదర్లాండ్స్ కూడా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో ఎదుగుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో ఆడుతున్నాయి. కాగా, పపువా న్యూగినియా గత వారం వెస్టిండీస్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది. మరోవైపు నేపాల్ గతంలోనూ టి20 రికార్డులు బద్దలుకొట్టిన దేశంగా నిలిచింది.

టి20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో.. ఓ బౌలర్‌ అత్యంత తక్కువ ఎకానమీతో బంతులేసి రికార్డు సృష్టించాడు. అతడి వయసు ఎంతో తెలుసా? 43. దాదాపు కోచ్ అవతారం ఎత్తే ఈ వయసులో అతడు రికార్డు కొల్లగొట్టాడు. గురువారం పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో ఉగాండా బౌలర్ సుబుగా నాలుగు ఓవర్ల కోటాలో రెండు మెయిడెన్లు సహా 4 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (4-2-4-2) పడగొట్టాడు. అంటే ఓవర్ కు ఒక్క పరుగు మాత్రమే అన్నమాట.

టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇదే అత్యంత ఉత్తమ ఎకానమీ. ఈ రికార్డు గతంలో దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ (2.25) పేరిట ఉంది.

- ఈ మ్యాచ్‌లో ఉగాండా మూడు వికెట్ల తేడాతో పీఎన్‌జీని ఓడించింది. వరల్డ్‌ కప్‌ల్లో ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు కూడా.

టాస్‌ నెగ్గిన ఉగాండా బౌలింగ్‌ ఎంచుకుంది. పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. కాగా, 78 పరుగుల టార్గెట్‌ ను ఉగాండా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాజత్ (33) టాప్‌ స్కోరర్‌. పపువా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఉగాండా కాస్త ఇబ్బంది పడింది. 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.

ఇంతకూ ప్రపంచ రికార్డు సాధించిన సుబుగా పేసరా? స్పిన్నరా? మీడియం పేసరా? అనే అనుమానం మీకు కలుగుతోందా? అతడు.. ఆఫ్ స్పిన్నర్. 55 టి20లు ఆడి 57 వికెట్లు తీశాడు.