Begin typing your search above and press return to search.

మూడేళ్ల తర్వాత.. నాలుగో స్పిన్నర్.. టీమ్ ఇండియాలో అనూహ్యం

ఈ నేపథ్యంలో వచ్చే గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో భారీ అనూహ్య మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 7:30 PM GMT
మూడేళ్ల తర్వాత.. నాలుగో స్పిన్నర్.. టీమ్ ఇండియాలో అనూహ్యం
X

భారత్ లో టెస్టు మ్యాచ్ అయితే ముగ్గురు స్పిన్నర్లతో దిగి ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం దశాబ్దాలుగా చూస్తున్నాం.. కానీ, కొన్నేళ్ల నుంచి ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడుతూ టీమ్ ఇండియా విజయాలు సాధిస్తోంది. పిచ్ బాగా స్పిన్ కు సహకరిస్తేనే మూడో స్పిన్నర్ ను తీసుకుంటోంది. ఇలానే గత వారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ పై తప్పుడు అంచనాతో వెళ్లి బోర్లాపడింది. ఈ నేపథ్యంలో వచ్చే గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో భారీ అనూహ్య మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ తీసుకుని..

గత బుధవారం బెంగళూరులో మొదలుకావాల్సిన మొదటి టెస్టు వర్షం కారణంగా గురువారం నుంచి జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగి 46 పరుగులకే పరిమితమైంది. వర్షం పడిన పరిస్థితుల్లో పిచ్ పేసర్లకు సహకరిస్తుండగా.. బ్యాటింగ్ తీసుకుని దెబ్బతిన్నది. మూడున్నర రోజుల్లోనే పరాజయం పాలైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 36 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ఓడింది. ఈ ప్రభావం వచ్చే టెస్టులపైనా పడింది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే కచ్చితంగా నాలుగు (న్యూజిలాండ్ తో 2, ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో 2) గెలవాల్సిన పరిస్థితి.

ముగ్గురు కాదు నలుగురు..

పుణెలో గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో టీమ్ ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగే ఆలోచన చేస్తోందట. వీరిలో ఒకరు స్పిన్‌ ఆల్‌ రౌండర్‌. రంజీ ట్రోఫీలో ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌ ను అనూహ్యంగా జట్టుతో చేర్చింది. సుందర్ మూడేళ్ల కిందట చివరి సారిగా టెస్టు ఆడడం గమనార్హం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ వ్యూహం మేరకే ఇదంతా జరుగుతున్నట్లు సమాచారం. పుణె టెస్టుల్ జడేజా, అశ్విన్ తో పాటు సుందర్, అక్షర్ పటేల్ తో బరిలో దిగనున్నట్లు తాజా మార్పు ప్రకారం స్పష్టం అవుతోంది. వీరంతా బ్యాటింగ్ కూడా చేయగల స్పిన్నర్లు. కుల్దీప్ ను పక్కనపెట్టి సుందర్ ను ఆడించే ఆలోచనలో ఉన్నట్లు తేలుతోంది. పైగా సుందర్ ఆఫ్ స్పిన్నర్, ఎడమచేతివాటం బ్యాటర్.

ఒక్కడే పేసరా?

నలుగురు స్పిన్నర్లతో దిగితే ఒక్కరే ఒక్కడే పేసర్ జట్టులో ఉంటాడు. అది బుమ్రానా? హైదరాబాదీ సిరాజా? అనేది చూడాలి. బుమ్రాకు విశ్రాంతి అంటున్నారు కానీ.. సిరాజ్ పై పూర్తి భారం వేయలేని పరిస్థితి. సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో బుమ్రానే కొనసాగించే చాన్స్ ఎక్కువ. ఇక ఫింగర్ స్పిన్నర్ అయిన సుందర్ మూడేళ్ల కిందట చివరి టెస్టు ఆడాడు. ఆరేడేళ్ల నుంచి టీమ్ ఇండియాలోకి వస్తూ పోతున్న అతడు నాలుగు టెస్టుల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2021లో ఆస్ట్రేలియాలోని పేస్ అనుకూలించే గబ్బాలో తొలి టెస్టు ఆడాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం రంజీలాడుతున్న అతడు తమిళనాడు తరఫఉన వన్‌ డౌన్‌ లో బ్యాటింగ్‌ కు దిగి భారీ సెంచరీ కొట్టాడు. హెడ్ కోచ్ గంభీర్‌ పట్టుబట్టి మరీ అతడిని జట్టులోకి తీసుకున్నాడని చెబుతున్నారు.

కొసమెరుపు: సుందర్ కు ఎంత ప్రాధాన్యం దక్కితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కు అంత డేంజర్ బెల్. 38 ఏళ్ల అశ్విన్ కంటే 24 ఏళ్ల సుందర్ ను జట్టు మేనేజ్ మెంట్ కీలకమని భావిస్తోంది. వచ్చే ఆస్ట్రేలియా టూర్ కు అశ్విన్ ను కాదని సుందర్ ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు.