నాడు సర్ఫరాజ్.. నేడు రోహిత్.. గావస్కర్ మోడలింగ్ కామెంట్స్ వైరల్
రెండు మూడేళ్ల కిందట.. దేశవాళీ సీజన్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ భారీగా పరుగులు సాధించాడు.
By: Tupaki Desk | 4 March 2025 3:59 PM ISTరెండు మూడేళ్ల కిందట.. దేశవాళీ సీజన్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ భారీగా పరుగులు సాధించాడు. కానీ, అతడిని టీమ్ ఇండియాకు మాత్రం ఎంపిక చేయలేదు.. కారణం ఏమిటా? అని ఆలోచిస్తే.. సర్ఫరాజ్ బరువు ఎక్కువగా ఉండడమేననే వ్యాఖ్యలు వినిపించాయి. ఇవి భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘‘మీకు స్లిమ్ పర్సనాలిటీలు కావాలంటే మోడలింగ్ కు వెళ్లండి.. క్రికెట్ కు ఎందుకు?’’ అని మండిపడ్డాడు.
తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని.. ఫిట్ నెస్ లేదని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షమా మొహమ్మద్ పెట్టిన పోస్టు కూడా తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు నేరుగా బీసీసీఐ కూడా స్పందించి షమా.. క్షమించరాని వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక సొంత పార్టీ కాంగ్రెస్ కూడా అండగా నిలవకపోయేసరికి షమా తన పోస్ట్ ను డిలీట్ కొట్టారు.
ఇక తాజాగా గావస్కర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. భారత క్రికెట్ బాగోగులే తప్ప.. ఇతర అంశాలు ఏవైనా సరే స్పందించని గావస్కర్ ఇప్పుడు షమా వ్యాఖలపై మాత్రం ఆగలేకపోయారు.
అప్పట్లో సర్ఫరాజ్ ను వెనకేసుకొచ్చినట్లే.. ఇప్పుడు రోహిత్ ను సైతం గావస్కర్ సమర్థించారు. క్రికెట్ కు నాజూకు ఆకృతి ఒక్కటే అవసరం లేదని, నాణ్యమైన ఆట కావాలని పేర్కొన్నారు. స్లిమ్ గా ఉండేవాళ్లే కావాలనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్లాలని చురకేశారు. క్రికెట్ లో బ్యాట్స్ మన్ పరుగులు చేయడమే కీలకమని.. మిగతావన్నీ ఆ తర్వాతేనని అన్నారు. తనను తాను ఉదాహరణగా చూపుకొంటూ.. పరుగ పందెంలో రెండు రౌండ్లు కూడా పరిగెత్తలేనని.. క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేయమంటే రోజంతా ఆడతానని అన్నారు. కాబట్టి క్రికెట్‌లో నాజూకుతనానికి చోటే లేదని.. ఆటను ఎంత బాగా ఆడగలరనేదే ముఖ్యమని గావస్కర్ అన్నారు. సర్ఫరాజ్ కూడా ఇలానే చాలాసార్లు కొందరితో మాటలు పడ్డాడని.. న్యూజిలాండ్ పై టెస్టులో 150 పరుగుల భారీ సెంచరీ చేశాడని గుర్తుచేశారు. వరుసగా హాఫ్ సెంచరీలూ బాదాడని.. అలాంటప్పుడు సర్ఫరాజ్ శరీరం బరువుతో సమస్య ఏముంటుంది? అని మానసికంగా ఎంత బలంగా ఉన్నామనేది ముఖ్యం అని గావస్కర్ విశ్లేషించారు.
కొసమెరుపు: ఈ వివాదానికి కారణమైన షమా మొహమ్మద్ చరిత్ర చాలానే ఉంది. విదేశీ క్రికెటర్లను అభిమానించేవారిని తాను ఇష్టపడనని గతంలో కోహ్లి చెప్పగా షమా.. విరుచుకుపడ్డారు.
మరోవైపు తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నూ వివాదంలోకి లాగారు షమా. రైతుల ఆందోళనను హేళన చేస్తూ కంగన పెట్టిన పోస్ట్ ను ప్రశ్నిస్తూ, ఇప్పుడేమంటారు మన్ సుఖ్ మాండవీయ (కేంద్ర మంత్రి), కంగనా అంటూ మరో పోస్ట్ చేశారు.