ఫుట్ బాల్ కు మన మెస్సీ, రొనాల్డో వీడ్కోలు.. అతడు పుట్టింది సికింద్రాబాద్ లోనే
క్రికెట్ ను ఓ మతంగా భావించే భారత దేశంలో మరే క్రీడ కూడా దాని స్థాయికి ఎదగడం లేదు.
By: Tupaki Desk | 16 May 2024 7:44 AM GMTక్రికెట్ ను ఓ మతంగా భావించే భారత దేశంలో మరే క్రీడ కూడా దాని స్థాయికి ఎదగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉండే ఫుట్ బాల్ కు భారత్ తో మాత్రం పెద్దగా ఆరదణ దక్కడం లేదు. ప్రజల్లో ఫుట్ బాల్ పట్ల మోజు లేదని కాదు.. కానీ, క్రికెట్ డామినేషన్. దీనికి నిదర్శనమే ఫుట్ బాల్ ప్రపంచ కప్ సందర్భంగా భారత్ లో వచ్చిన వ్యూయర్ షిప్. ఇక పాశ్చాత్య దేశాలు సాకర్ గా పిలుచుకునే ఫుట్ బాల్ కు యూరప్, దక్షిణ అమెరికా దేశాలే పెద్దన్నలు. అర్జెంటీనాకు చెందిన లయోనల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న ఆటగాళ్లు. కానీ, భారత్ కూ అలాంటి ఆటగాడు ఒకడున్నాడని చాలామందికి తెలియదు.. ఓ దశలో వీరిద్దరినీ మించి గోల్స్ కొట్టాడని.. ఇప్పటికీ వారిద్దరి తర్వాత అతడే ఉన్నాడని ఎవరికీ తెలియదు.
ఇక వీడ్కోలు..
భారత ఫుట్ బాల్ లో స్టార్ ఆటగాళ్లంటే గతంలో బైచుంగ్ భూటియా , మురుగన్ విజయన్ పేర్లు వినిపించేవి. సిక్కిం, కేరళకు చెందిన వీరిద్దరూ రెండు తరాల వారు. భారత ఫుట్ బాల్ కు మళ్లీ ఇలాంటివారు దొరుకుతారా? అనే ఆందోళన మధ్య వచ్చాడు సునీల్ ఛెత్రి. 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఇతడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 94 గోల్స్ కొట్టాడు. ఇప్పటికీ ఆడుతున్నవారిలో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ఆటగాడు ఛెత్రీనే. ఇతడి కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో (128), లియోనిల్ మెస్సి (106) ఉన్నారు. భారత్ తరఫున అయితే ఛెత్రినే టాప్ స్కోరర్.
తాజాగా ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
2 దశాబ్దాల కెరీర్
ఛెత్రీ 2005 నుంచి భారత్ కు ఆడుతున్నాడు దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ కు జూన్ 6న కువైట్ తో మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. రిటైర్‌మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు. ‘‘
కెరీర్‌లో గొప్ప జ్ఞాపకాలు చాలా ఉన్నాయని.. బాధ్యతలు, ఒత్తిడి, అమితమైన ఆనందం.. ఇలా ఎన్నింటినో అనుభవించానని వివరించాడు. వ్యక్తిగతంగా నేను ఇన్నేళ్లపాటు భారత జట్టుకు ఆడతానని అనుకోలేదన్నాడు. దేశం కోసం ప్రతి క్షణం కష్టపడ్డానని పేర్కొన్నాడు.
కువైట్ తో కీలక పోరు అనంతరం..
భారత్ ప్రపంచ కప్ అర్హత దిశగా ముందుకెళ్లాలంటే కువైట్ తో మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే మూడు పాయింట్లు సాధించనుంది.
పుట్టింది సికింద్రాబాద్ లోనే..
భారత ఫుట్ బాల్ చరిత్రలో దిగ్గజంగా మిగిలిపోయే సునీల్ ఛెత్రి పుట్టింది సికింద్రాబాద్ లోనే. తండ్రి సైన్యంలో అధికారి కావడంతో ఛెత్రీ కుటుంబం సికింద్రాబాద్ లో పుట్టాడు. సునీల్ తండ్రి కేబీఛత్రి ఆర్మీ ఫుట్ బాల్ జట్టుకు ఆడాడు.