...300 కొట్టేసేదే.. ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ సూపర్ బోణీ
287.. ఇదీ 2024లో సన్ రైజర్స్ చేసిన స్కోరు.. అది ఒకప్పటి టాప్ స్కోరర్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై.
By: Tupaki Desk | 23 March 2025 11:45 PM ISTఐపీఎల్-17లోనే దాదాపు 300 కొట్టేసినంత పని చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.. 250 పరుగులు దాటితేనే గొప్ప అనుకునే ఐపీఎల్ లో.. అదికూడా ఒకప్పుడు తక్కువ స్కోర్ల జట్టుగా ముద్రపడిన సన్ రైజర్స్ గత ఏడాది చూపిన దూకుడు మామూలు స్థాయి కాదు.
287.. ఇదీ 2024లో సన్ రైజర్స్ చేసిన స్కోరు.. అది ఒకప్పటి టాప్ స్కోరర్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై. ముంబై మీద 277, ఢిల్లీపై 266.. ఇలా చెప్పుకొంటూ పోతే 200 పరుగులను అవలీలగా కొట్టేసింది.
మరి నిరుడి కంటే ఈ ఏడాది కాస్త పరిస్థితులు మారాయి. మార్క్ రమ్ వంటి దూకుడైన బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్ జట్టుతో లేడు. అయినా, ఐపీఎల్ 2025 ను సన్ రైజర్స్ భారీ విజయంతో ప్రారంభించింది. హైదరాబాద్ ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ఐపీఎల్ లో రెండో హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం.
కాగా, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగానే ప్రయత్నించింది. 242/6తో సరిపెట్టుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (70; 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ లు), సంజూ శాంసన్ (66; 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లు) పోరాడారు. షిమ్రాన్ హెట్ మయర్ (42; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లు), శుభమ్ దూబె (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లు) దూకుడుగా ఆడారు.
కాస్త అయితే 300 తాకేదే
టి20ల్లో 300 అంటే మామాలూ మాటలు కాదు. నిరుడు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది సన్ రైజర్స్. ప్రస్తుత సీజన్ లో తొలి మ్యాచ్ లోనే తనదైన ఆటతో 300 కొట్టేస్తుందా? అనిపించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67; 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లు) విధ్వంసానికి, వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (106 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్ లు) సునామీ తోడైంది. క్లాసెన్ (34; 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (30; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24; 11 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడడంతో 286 పరుగులు చేసింది.
వాస్తవానికి నితీశ్ కాసేపు నిలిచినా, 20 ఓవర్ ను తుషార్ దేశ్ పాండే కట్టడి చేయకున్నా.. సన్ రైజర్స్ 300 చేరేదే.. చరిత్రలో నిలిచేదే.. అయితే, ఈ సీజన్ లో ఇది మొదటి మ్యాచ్ మాత్రమే.. ముందుకెళ్లే కొద్దీ 300 బాదేస్తుందని ఆశించడంలో తప్పు లేదు.