సూర్య.. చీఫ్ సెలక్టర్.. చీఫ్ కోచ్ రికార్డు జస్ట్ మిస్
టి20ల్లో టాప్ బ్యాట్స్ మన్.. 360 డిగ్రీల్లో షాట్లు కొట్టే నైపుణ్యం.. కానీ, వన్డేల్లో తేలిపోతున్నాడు. గేమ్ చేంజర్ అవుతాడనుకుంటే అవకాశాలు మిస్ చేసుకుంటున్నాడు
By: Tupaki Desk | 25 Sep 2023 7:24 AM GMTటి20ల్లో టాప్ బ్యాట్స్ మన్.. 360 డిగ్రీల్లో షాట్లు కొట్టే నైపుణ్యం.. కానీ, వన్డేల్లో తేలిపోతున్నాడు. గేమ్ చేంజర్ అవుతాడనుకుంటే అవకాశాలు మిస్ చేసుకుంటున్నాడు. ఇలాగైతే వన్డేలకు అతడిని ఎంపిక చేయడం కష్టమే.. ఇవీ ఆ క్రికెటర్ పై ఉన్న విమర్శలు. కానీ, వరుసగా రెండు మ్యాచ్ లలోనూ అర్ధ సెంచరీలు సాధించి వాటికి చెక్ పెట్టాడు.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో కంగారూలను మట్టికరిపించింది. తొలుత ఓపెనర్ శుభ్ మన్ గిల్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగగా.. తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించాడు. దీంతో వన్డేల్లో ఆసీస్ పై అత్యధిక స్కోరు (399) సాధించింది టీమిండియా.
ఆ రికార్డులు జస్ట్ మిస్..
ఆదివారం నాటి మ్యాచ్ లో మొదట అయ్యర్.. చివర్లో సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్సే హైలైట్. అతడి ధాటికి ఆఖరి 9వ ఓవర్లలో భారత్ ఏకంగా 93 పరుగులు రాబట్టింది. అతడు టి20 తరహాలో 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. గ్రీన్ వేసిన 44వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రికార్డయిన ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కూడా సాధించేస్తాడేమోనని అనిపించింది. కానీ, అందుకోలేకోపోయాడు. ఇవే కాదు సూర్య కొన్ని రికార్డులు కూడా మిస్ అయ్యాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిస్
ధోనీ, యువరాజ్, రైనా, కోహ్లి.. రోహిత్.. వన్డేల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు వీరిలో ఎవరిదీ కాదు. అసలు ఆ రికార్డు ఎవరి పేరిట ఉందో ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఆ రికార్డును సాధించిన ఆటగాడు ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. అతడే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్. 2000 సంవత్సరంలో అగార్కర్ జింబాబ్వే మీద 21 బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టాడు. 1983లో కపిల్ దేవ్ నెలకొల్పిన (వెస్టిండీస్ పై) 22 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 23 ఏళ్లుగా అగార్కర్ రికార్డు అలానే ఉంది.
హైదరాబాద్ లో చీఫ్ కోచ్ ద్రవిడ్
అగార్కర్ తర్వాత తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ రికార్డు ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (22 బంతుల్లో, 2003లో న్యూజిలాండ్ పై), వీరేంద్ర సెహ్వాగ్ (22 బంతుల్లో 2001లో కెన్యాపై) , యువరాజ్ సింగ్ (22 బంతుల్లో 2004లో బంగ్లాదేశ్ పై) పేరిట ఉంది. కపిల్ సహా వీరంతా 22 బంతుల్లో అర్ధ సెంచరీలు కొట్టినా.. అగార్కర్ కంటే ఒక బంతి ఎక్కువే తీసుకున్నారు. కాగా, ఆదివారం మ్యాచ్ లో సూర్య మాత్రం 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వాస్తవానికి గ్రీన్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టిన సూర్య.. 14 బంతుల్లో 29 పరుగులకు చేరాడు. అదే ఊపులో నాలుగైదు బంతులు బౌండరీ దాటితే హాఫ్ సెంచరీ పూర్తయ్యేదేమో..? కానీ పేసర్ అబాట్ బంతులను బీట్ అవడంతో సాధ్యం కాలేదు.
కొసమెరుపు: టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో (21) అర్ధ సెంచరీ రికార్డు అగార్కర్ ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్. ఇక ద్రవిడ్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టి అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. అంటే.. సూర్య వీరిద్దరి రికార్డులకూ దగ్గరగా వచ్చాడు. ఇక ద్రవిడ్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేసింది ఎక్కడో తెలుసా..? మన హైదరాబాద్ లోనే. న్యూజిలాండ్ తో లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్బీ) స్టేడియంలో 2003 మార్చి 9న జరిగిన మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు.