మళ్లీ పేలిన గన్.. ఒలింపిక్స్ లో మూడో పతకం.. కాంస్యమే..
పారిస్ ఒలింపిక్స్ రోజులు గడిచిపోతూనే ఉన్నాయ్.. ఇప్పటికే చైనా స్వర్ణాల వేటలో దూసుకెళ్తోంది
By: Tupaki Desk | 1 Aug 2024 9:47 AM GMTపారిస్ ఒలింపిక్స్ రోజులు గడిచిపోతూనే ఉన్నాయ్.. ఇప్పటికే చైనా స్వర్ణాల వేటలో దూసుకెళ్తోంది. పది బంగారు పతకాలు కొల్లగొట్టింది. ఇది అమెరికా కంటే డబుల్. ఆతిథ్య ఫ్రాన్స్ 8 స్వర్ణాలతో రెండోస్థానంలో ఉంది. భారత్ మాత్రం వేట కొనసాగిస్తోంది. ముచ్చటగా మూడో పతకాన్ని గురువారం ఒడిసి పట్టింది. అయితే, అది కూడా షూటింగ్ లోనే. యువ షూటర్ స్వప్నిల్ తన ఒలింపిక్ పతకం స్వప్నం నెరవేర్చుకున్నాడు.
మను, సరబ్ సరసన..
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు డబుల్ డిజిట్ పతకాలు ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లో రెండు కాంస్యాలు రాగా.. మూడోదీ వరించింది. స్వప్నిల్ కుసాలె తన కౌశలం చాటాడు. మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్ లో 28 ఏళ్ల ఈ షూటర్ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్యం వరించింది. పోటీని నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో పుంజుకొన్నాడు. ఒక దశలో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగాడు. పతకం దక్కదు అనే భయాందోళనల మధ్య టాప్-3లోకి వచ్చాక చెలరేగాడు. 451.4 పాయింట్లను సాధించి కాంస్యం అందుకున్నాడు. చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ (461.3) రజతం దక్కించుకున్నారు.
మూడు పొజిషన్లు..
మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ లో మూడు పొజిషన్లు ఉంటాయి. ఒకటి బోర్లా పడుకొని (ప్రోన్), రెండు మోకాళ్ల మీద (నీలింగ్), మూడు నిల్చొని (స్టాండింగ్) షూటింగ్ చేయాలి. స్వప్నిల్ మోకాళ్లపై షూటింగ్‌లో 153.5, ప్రోన్ లో 156.8, స్టాండింగ్ లో 141.1 పాయింట్లను (స్టేజ్ 2 ఎలిమినేషన్‌తో కలిపి) సాధించాడు. కాగా, ఈ ఒలింపిక్స్ లో మను భాకర్ రెండో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత కేటగిరీలో తొలి పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్ జోత్ సింగ్ తో కలిసి రెండో కాంస్యం తెచ్చింది. ఇప్పుడు స్వప్నిల్ తెచ్చినదీ కాంస్యమే. స్వర్ణం లేదా రజతం సాధిస్తేనే పాయింట్ల పట్టికలో దేశం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మూడూ కాంస్యాలే కావడంతో భారత్ 41వ స్థానంలో ఉంది. ఒక్క స్వర్ణం సాధించినా టాప్ 15లోకి వెళ్లే చాన్సుంది. తెలుగు తేజాలు బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరి స్వర్ణాలు తెస్తారేమో చూడాలి.