పాక్ షాకిచ్చిన అమెరికా గ్రూప్-ఏ అంచనాలు ఎలా మార్చిందంటే...?
ఇదే అమయంలో... అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లపై ఎవరికీ ఏమాత్రం అంచనాలు లేవనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి.
By: Tupaki Desk | 8 Jun 2024 5:35 AM GMTఅద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదన్నస్థాయిలో టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టు పెర్ఫార్మెన్స్ ఉందనే చెప్పాలి. వాస్తవానికి అమెరికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతుంది. అయితే ఫెర్మార్మెన్స్ లో మాత్రం అలా కనిపించడం లేదు.. పాకిస్థాన్ ని సైతం ఓడించి ప్రస్తుతం గ్రూప్ లో టాపర్ గా నిలిచింది. మరొక్క మ్యాచ్ గెలిచిందంటే సూపర్-8లోకి చేరిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి!
అవును... టీ20 వరల్డ్ కప్ లో ఆతిధ్య అమెరికా జట్టు అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీ 20 వరల్డ్ కప్ లో గ్రూప్ - ఏ లో భారత్, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్ లతో అమెరికా ఉంది. ఈ క్రమంలో ప్రతీ గ్రూపులోనూ ఒక్కో జట్టూ.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలోనే గ్రూపులోని ఐదు జట్లలో టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు సూపర్ - 8 కు అర్హత సాధిస్తాయి.
ఈ నేపథ్యంలో... గ్రూప్ - ఏ లోని ఐదు జట్లను పరిశీలించినవారు ఎవరైనా సూపర్ - 8 కి భారత్, పాకిస్థాన్ వెళ్తాయని ఆలోచించినా తప్పేలేదు! కారణం... ఆ రెండు జట్లూ ఎంత బలమైనవనేది తెలిసిన విషయమే. ఇదే అమయంలో... అమెరికా, కెనడా, ఐర్లాండ్ జట్లపై ఎవరికీ ఏమాత్రం అంచనాలు లేవనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. అయితే... ఆ అంచనాలను తలకిందులు చేసింది అమెరికా.
ఇందులో భాగంగా... పాక్ పై సంచలన విజయంతో గ్రూప్-ఏ సమీకరణాలను మార్చేసింది అమెరికా. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ తో విజయం సాధించిన అమెరికా... రెండు విజయాలు సాధించినట్లయ్యింది. కాగా.. అమెరికా ఇప్పటికే కెనడాపై గెలిచిన సంగతి తెలిసిందే. ఇలా రెండు మ్యాచ్ లు గెలిచిన అమెరికా.. మిగిలిన రెండు మ్యాచ్ లనూ భారత్, ఐర్లాండ్ పై ఆడాల్సి ఉంది.
వీటిలో భారత్ పై ఓడినా.. ఐర్లాండ్ పై గెలిస్తే మాత్రం సూపర్ - 8కి అర్హత సాధించడం తేలికనే చెప్పాలి. ఇదే క్రమంలో ఐర్లాండ్ పై ఓడినా కూడా ఆ జట్టు సూపర్ - 8 అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే సమయంలో... పాక్ ఇంకా భారత్, కెనడా, ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో భారత్ పై ఓడి మిగిలిన మ్యాచ్ లలో గెలిచినా.. సూపర్ - 8 ఆశలు సజీవంగా ఉండే అవకాశం కష్టమని అంటున్నారు.
అంటే... పాకిస్థాన్ పై గెలవడంతో బిగ్ షాకిచ్చిన అమెరికా... భారత్ తో కలిసి గ్రూప్-ఏ నుంచి సూపర్ 8 కి అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయన్నమాట.