Begin typing your search above and press return to search.

క్రికెటర్లకు తుపాను తెచ్చింది చోటు.. టీమిండియాలోకి అనూహ్యంగా

టి20 ప్రపంచ కప్ ముగిసింది. టీమిండియాకు ఎంతో ఆశగా ఎదురుచూసిన టైటిల్ కూడా దక్కింది

By:  Tupaki Desk   |   3 July 2024 5:49 AM GMT
క్రికెటర్లకు తుపాను తెచ్చింది చోటు.. టీమిండియాలోకి అనూహ్యంగా
X

టి20 ప్రపంచ కప్ ముగిసింది. టీమిండియాకు ఎంతో ఆశగా ఎదురుచూసిన టైటిల్ కూడా దక్కింది. అంతేకాదు.. ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ల అంతర్జాతీయ టి20 కెరీర్ కూ ముగింపు కార్డు పడింది. అందులో ముఖ్యంగా కెప్టెన్ కూడా ఉండడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక తదుపరి ఏమిటి..? రెండున్నర నెలలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), మరో నెల రోజులు ప్రపంచ కప్ తో టి20 సిక్సర్లు ఫోర్ల విందు వినోదాల్లో మునిగి తేలిన ప్రతి క్రికెట్ అభిమాని ఇప్పుడు వేస్తున్న ప్రశ్న ఇది. అందుకేనేమో..? ఆలస్యం లేకుండా జింబాబ్వే టూర్ వచ్చేసింది.

ఐదు టి20ల సుదీర్ఘ సిరీస్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో వెనుకబడినా.. ఓ 20 ఏళ్ల కిందట వరకు జింబాబ్వే మంచి జట్టే. హీత్ స్ట్రీక్, గ్రాంట్ ఫ్లవర్, ఆండీ ఫ్లవర్, ఒలాంగా వంటి మేటి క్రికెటర్లు ఆ దేశం నుంచి వచ్చారు. అయితే, వివిధ పరిస్థితుల కారణంగా జింబాబ్వే క్రికెట్ పతనమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పసి కూన అని అనలేం కానీ.. ద్వితీయ శ్రేణి స్థాయిలో సంచలనాలు రేపగల జట్టే. అలాంటి జింబాబ్వేతో టీమిండియా ఈ నెల 6 నుంచి ఐదు టి20లు ఆడనుంది.

అనూహ్యంగా మూడు మార్పులు.

జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వం వహించనున్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్ ల కోసం ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ అకస్మాత్తుగా మార్చింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌, పేస్ ఆల్ రౌండర్

శివం దూబె, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ బదులుగా సాయి సుదర్శన్‌, జితేశ్‌ శర్మ, హర్షిత్‌ రాణాను తీసుకుంది. కానీ, దీనికి పెద్ద కారణమే ఉంది. టి20 ప్రపంచ కప్ ఫైనల్స్ అనంతరం టీమిండియా బార్బడోస్ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ, తుపాను కారణంగా బార్బడోస్‌ రాజధాని బ్రిడ్జిటౌన్ లో చిక్కుకుపోయింది. దీంతో శాంసన్‌, దూబె, యశస్వి అక్కడే ఉండిపోయారు. వీరి బదులుగా సాయి, జితేశ్, హర్షిత్ లకు చాన్సిచ్చింది. సాయి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు. మంచి టాలెంట్ ఉన్న స్ట్రోక్ ప్లేయర్. జితేశ్ వికెట్ కీపర్ బ్యాటర్. హర్షిత్ రాణా ఐపీఎల్ లో కోల్ కతా తరఫున మంచి ప్రదర్శన చేశాడు.