భారత్-పాక్ టి20 మ్యాచ్ టికెట్.. కనీసం లక్ష.. గరిష్ఠం రూ.43 లక్షలు
ఆ రెండు జట్లు టెస్టులు ఆడక దశాబ్దం దాటింది.. వన్డే, టి20 సిరీస్ ల సంగతి సరేసరి.. వాటి మధ్య కనీసం ఆరు నెలలకో మ్యాచ్ అయినా కష్టమే
By: Tupaki Desk | 29 May 2024 12:30 PM GMTఆ రెండు జట్లు టెస్టులు ఆడక దశాబ్దం దాటింది.. వన్డే, టి20 సిరీస్ ల సంగతి సరేసరి.. వాటి మధ్య కనీసం ఆరు నెలలకో మ్యాచ్ అయినా కష్టమే.. పొరుగునే ఉన్నా.. ఐసీసీ టోర్నమెంట్లలో తప్ప నేరుగా తలపడడమే లేదు.. కానీ, ఆ రెండూ టాప్ జట్లు. అంతేకాదు చిరకాల ప్రత్యర్థులు. ఇంకేం.. వాటి మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది.
చిరకాల ప్రత్యర్థులు..
భారత్, పాకిస్థాన్ దాయాదులే కాదు.. క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థులు అనే సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు గతంలో దుబాయ్ లో సిరీస్ లు ఆడేవి. ద్వైపాక్షిక టోర్నీలూ ఆడేవి. అయితే, ముంబై దాడుల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో సిరీస్ లకు అనుమతి నిలిపివేసింది. దీంతో భారత్-పాక్ నేరుగా తలపడడం అనే మాటే లేకుండా పోయింది. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లోనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్. ఇందులోభాగంగా భారత్ నిర్వహించిన వన్డే ప్రపంచకప్ నకు గత ఏడాది అక్టోబరులో వచ్చింది పాకిస్థాన్. మన హైదరాబాద్ లోనే మూడు మ్యాచ్ లు ఆడింది. భారత్ తో అహ్మదాబాద్ లో లీగ్ మ్యాచ్ లో తలపడింది. మళ్లీ ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాలో రెండు జట్లూ ఎదురుపడనున్నాయి.
న్యూయార్క్ లో పోరాటం
భారత్ –పాకిస్థాన్ మధ్య న్యూయార్క్ లో టి20 ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. జూన్ 9న జరిగే ఈ మ్యాచ్ కు కొత్తగా నిర్మించిన న్యూయార్క్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక టికెట్ రేటు ఎంతని అంటారా? ప్రారంభ ధర రూ.96 వేలు మాత్రమే. సీటు రేంజ్ పెరిగిన కొద్దీ ఈ ధర పెరుగుతూ పోతుంది. అత్యంత ఖరీదైన ప్రీమియం టికెట్ ధర రూ.43 లక్షలు. ప్రపంచంలోనే ఏ క్రికెట్ మ్యాచ్ కూ ఇప్పటివరకు ఇంత ధర లేదు. అంతేకాదు.. సగటు భారతీయుడు పదేళ్లలో సంపాదించిన దాని కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.