Begin typing your search above and press return to search.

చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్.. టికెట్ జస్ట్ రూ.1.86 కోట్లే

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య వన్డేలు.. వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య టి20లు

By:  Tupaki Desk   |   4 March 2024 7:27 AM GMT
చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్.. టికెట్ జస్ట్ రూ.1.86 కోట్లే
X

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య వన్డేలు.. వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య టి20లు.. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ లు, ఉత్కంఠభరిత మ్యాచ్ లకు కొదవ ఉండదు. రసవత్తర సమరం అంటే ఏమింటో వీటి ద్వారా తెలుస్తుంది. వీటికి మించి మైదానంలోకి జట్లు దిగకముందే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. ప్రస్తుతం కాస్త ఈ టెన్షన్ తగ్గినా, ఆ జట్ల మధ్య మ్యాచ్ అంటే మాత్రం చాలా ఆసక్తి. అయితే, కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు. ఐసీసీ టోర్నీల్లో తప్ప ముఖాముఖి తలపడుతున్నది లేదు.

ఈసారి అమెరికాలో..

భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మొన్నటి మొన్న వన్డే ప్రపంచ కప్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్షమందిపైగా హాజరయ్యారు. అలాంటి భారత్-పాక్ మధ్య మరో మ్యాచ్ ఎప్పుడు ఉంటుందా? అని అభిమానులు ఎదురుచూస్తుంటారనేది సందేహం లేదు. ఈ లోటును తీర్చేందుకు ఆరు నెలల్లో మ్యాచ్ జరగనుంది. అయితే, వేదిక ఈసారి అగ్రరాజ్యం అమెరికా కావడమే విశేషం. గతంలో ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన టి20 మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు. ఇదే రీతిన భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఉంటుందని భావిస్తూ అభిమానులు పోటెత్తడం ఖాయం అని తెలుస్తోంది.

అటు భారతీయులు.. ఇటు పాకిస్థానీలు

అమెరికాలో ఆసియా సంతతి వారు అధికం. చైనా తర్వాత భారతీయులే అధికం. వీరితోపాటు పాకిస్థానీలూ ఎక్కువగానే ఉంటారు. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ కు.. ఓ టి20 మ్యాచ్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తే ఆదరణ మామూలుగా ఉండదు. జూన్ 9న చిరకాల ప్రత్యర్థుల మధ్య అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా మారాయి. టికెట్ మామూలు ధర రూ.500 నుంచి రూ.33 వేలు మాత్రమే. అయితే, కొందరు వీటిని ముందుగానే కొనేసి రీ సేల్ వెబ్ సైట్స్ లో ఉంచుతున్నారు. ధర ఏకంగా రూ.33 లక్షల నుంచి రూ.1.86 కోట్లు చెబుతున్నారు. అయినప్పటికీ వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదని సమాచారం. అంటే.. భారత్-పాక్ మ్యాచ్ చూడాలంటే.. అమెరికాలో మీరు లక్షాధికారినో, కోటీశ్వరుడో అయి ఉండాలి.