అండర్-19 వరల్డ్ కప్ హీరో.. కోహ్లితో కలిసి ఆడి.. కోహ్లికే అంపైర్
ఇదంతా ఎందకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలోనే..
By: Tupaki Desk | 19 March 2025 6:30 PM ISTవిధి రాత అందరికీ ఒకేలా ఉండదు.. అందులోనూ స్పోర్ట్స్ లో.. దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాటల్లో చెప్పాలంటే.. తక్కువ ప్రతిభ ఉన్న రవిశాస్త్రి వంటి సాధారణ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లో రాణించవచ్చు.. మంచి టాలెంట్ ఉన్న వినోద్ కాంబ్లీ లాంటి వాడు ఫెయిలవచ్చు.. ఇక్కడంతా పరిస్థితుల ప్రభావమే. ఇదంతా ఎందకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలోనే..
విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, అజింక్య రహానే.. వీరంతా టీమ్ ఇండియాకు ఆడినవారు. ఆడుతున్నవారు. కానీ, వీరందరి కంటే మెరుగ్గా రాణించిన ఓ ఆటగాడు మాత్రం టీమ్ ఇండియా దరిదాపుల్లోకి రాలేకపోయాడు. ఇప్పుడు కోహ్లి ఆడబోతున్న మ్యాచ్ లకు అంపైర్ గా చేయబోతున్నాడు.
2008 అండర్-19 ప్రపంచ కప్ భారత్ కే కాదు ప్రపంచంలోని చాలా జట్లకు మేటి క్రికెటర్లను అందించింది. జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), విరాట్ కోహ్లి (ఇండియా) వీరిలో కొందరు. ఇదే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా సభ్యులు రహానే, జడేజా. ఇక 2008 అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు తన్మయ్ శ్రీవాస్తవ. అయితే, కోహ్లి, జడేజా, రహానే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కు సిద్ధం అవుతుండగా.. తన్మయ్ కూడా ఐపీఎల్ కు సిద్ధం అవుతున్నాడు. కానీ, ఆటగాడిగా కాదు అంపైర్ గా.
అతడే కీలకం..
శ్రీవాస్తవ ప్రొఫెషనల్ క్రికెట్ కు ఐదేళ్ల కిందటే వీడ్కోలు పలికాడు. దేశవాళీ క్రికెట్ కు సేవలందిస్తున్నాడు. వ్యాఖ్యాతగా మారాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 159 పరుగులకే ఆలౌటైంది. వన్ డౌన్ లో వచ్చిన శ్రీవాస్తవ (46)నే టాప్ స్కోరర్. కోహ్లి (19) పెద్దగా రాణించలేదు. అయితే, భారత బౌలర్ల దెబ్బకు సఫారీలు 103/8కు పరిమితం అయ్యారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది.
కాగా, 2008 అండర్ 19 ప్రపంచ కప్ ఆడిన భారత ఆటగాళ్లలో కోహ్లి, రహానే, జడేజాతో పాటు సౌరభ్ తివారీ, మనీశ్ పాండే, అభినవ్ ముకుంద్ టీమ్ ఇండియాకు కొన్ని మ్యాచ్ లు ఆడారు. ఫైనల్లో టాప్ స్కోరర్ అయిన ఎడమచేతివాటం బ్యాటర్ అయిన తన్మయ్ మాత్రం టీమ్ ఇండియాకు ఎంపిక కాలేకపోయాడు.