Begin typing your search above and press return to search.

8 టెస్టులు.. 5 విజయాలు.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చాలెంజ్

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ).. రెండు సీజన్లుగా టీమ్ ఇండియాను ఊరిస్తున్న టైటిల్ ఇది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 2:30 PM GMT
8 టెస్టులు.. 5 విజయాలు.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చాలెంజ్
X

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ).. రెండు సీజన్లుగా టీమ్ ఇండియాను ఊరిస్తున్న టైటిల్ ఇది. ఒకసారి న్యూజిలాండ్, మరోసారి ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం ఎదుర్కొంది. ఇప్పుడు మూడో సీజన్ నడుస్తోంది. అద్భుతమైన ప్రదర్శనతో భారత్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ టీమ్.. ఏడు విజయాలు, రెండు పరాజయాలు, ఒక డ్రాతో 86 పాయింట్లు సాధించింది. విజయాల శాతం 71.67. అయితే, మన తర్వాత ఉన్న ఆస్ట్రేలియా పాయింట్లు 90. విజయాల శాతం 62.50. ఆ జట్టు 12 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించింది. మూడు డ్రాలు, ఒక పరాజయం ఎదుర్కొంది.

వర్షం కొట్టిన దెబ్బ

భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ తో రెండో టెస్టు ఆడుతోంది. కాన్పూర్ లో జరుగుతున్న ఈ టెస్టులో వర్షం దెబ్బకొట్టింది. మొదటి రోజు సగం ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో, మూడో రోజు ఒక్క బంతీ పడలేదు. దీంతో రెండున్నర రోజుల (వర్షం రాకుంటే) ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఫలితం రావడం కష్టమే. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే భారత్ దే గెలుపు అనడంలో సందేహం లేదు.

8లో ఐదు గెలవడం సాధ్యమా?

భారత్ తదుపరి నాలుగు నెలల్లో 8 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో అక్టోబరులో న్యూజిలాండ్ తో మూడు టెస్టులు స్వదేశంలో, నవంబరు నుంచి జనవరి వరకు ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం ఐదు గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు నేరుగా చేరుతుంది. నాలుగే గెలిస్తే మాత్రం వేరే జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు టెస్టులను క్లీన్ స్వీప్ చేయొచ్చు. తాజాగా శ్రీలంక రెండు టెస్టుల్లో కివీస్ ను ఓడించింది. మన జట్టుకూ ఇది సాధ్యమే. అయితే, న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేం. గెలవకున్నా ఆ జట్టు ఒక్క మ్యాచ్ నైనా డ్రా చేయగలిగితే మనకు దెబ్బే. న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా మూడు టెస్టులు గెలిచిందనుకున్నా.. ఇక ఆస్ట్రేలియాలో కనీసం రెండు టెస్టులు గెలవాలి. ఇది కూడా కాస్త కష్టమే కానీ.. అసాధ్యమేమీ కాదు.

కంగారూలు తలొంచుతారా?

ఆస్ట్రేలియాలో జరిగిన గత రెండు బోర్డర్-గావస్కర్ సిరీస్ లను భారత్ గెలుచుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్ ను కోల్పోకూడదని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది. అందులోనూ 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతోంది. దీంట్లో ఎంతమేరకు రాణిస్తుందో చూడాలి. ఫామ్ ప్రకారం చూస్తే ఆస్ట్రేలియాను భారత్ ఓడించే చాన్సుంది. మరి ‘డబ్ల్యూటీసీ ఫైనల్’ చాలెంజ్ ను టీమ్ ఇండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.