Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాకు మరో కెప్టెన్? 2025 వస్తూ వస్తూనే భారీ మార్పులు

త్వరలో ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్‌ కు పాండ్యాను కెప్టెన్‌ చేస్తారని, ఆ తర్వాత పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 5:30 PM GMT
టీమ్ ఇండియాకు మరో కెప్టెన్? 2025 వస్తూ వస్తూనే భారీ మార్పులు
X

టెస్టుల్లోనా? వన్డేల్లోనా? టి20ల్లోనా? టీమ్ ఇండియాలో ఏదో జరుగుతోంది..? ఒకదాని వెంట ఒకటే మార్పులు..? ఆటగాళ్లు జట్టులోకి వచ్చి పోయినంత ఈజీగా కెప్టెన్లు మారిపోతున్నారు.. మూడేళ్లలో టెస్టు జట్టుకు మూడో కెప్టెన్ వచ్చాడు.. 2022కు ముందు విరాట్ కోహ్లి.. తర్వాతి నుంచి రోహిత్ శర్మ.. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా.. ఇక టి20ల్లోనూ ఇంతే.. మూడేళ్ల కిందటి వరకు విరాట్.. తర్వాత రోహిత్..మధ్యలో హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్. చెబుతూ పోతే ఇదో పెద్ద కథలా సాగిపోతోంది.

వన్డేల్లోనూ మార్పు తప్పదా?

టెస్టులు, వన్డేలు, టి20లు.. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లివి. చాలా జట్లకు వీటిలో వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహిస్తున్నారు. కానీ, భారత్ కు మాత్రం మొన్నటివరకు ఒక్కరే కెప్టెన్. రోహిత్ శర్మ రిటైర్ కావడంతో టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ చేశారు. వాస్తవానికి దీనికిముందు కెప్టెన్ గా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు దక్కుతాయని భావించినా, అనూహ్యంగా సూర్యను అవకాశం వరించింది. మరిప్పుడు రోహిత్ వన్డేల నుంచి కూడా ఔట్ అని అంటున్నారు. దీంతో టీమ్‌ ఇండియాకు మూడో సారథి రాబోతున్నాడా? అనే చర్చ నడుస్తోంది.

కొత్త ఏడాదిలో..

టీమ్ ఇండియాలో 2025 వస్తూ వస్తూనే భారీ మార్పులు తెస్తోంది. టెస్టుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ స్థానం గల్లంతైంది. ఇక వన్డేల సంగతి ఏమిటనే చర్చ మొదలైంది. ఈ ఫార్మాట్‌ లో కెప్టెన్‌ గా హార్దిక్‌ పాండ్యాను బీసీసీఐ ఎంపిక చేయనుందనే మాట వినిపిస్తోంది. త్వరలో ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్‌ కు పాండ్యాను కెప్టెన్‌ చేస్తారని, ఆ తర్వాత పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దీంతోపాటు పాకిస్థాన్‌ ఆతిథ్యంలో ఫిబ్రవరి నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ ఇండియాకు పాండ్యా నాయకత్వంలోనే ఆడనుంది. రోహిత్ ను ఆటగాడిగానైనా కొనసాగిస్తారా? అనేది చూడాలి. రోహిత్ సిడ్నీ టెస్టు అనంతరం టెస్టులకు రిటైరై.. వన్డేల గురించి ప్రస్తావిస్తేనే ఇదంతా.

మూడు ఫార్మాట్లకు ముగ్గురు రోహిత్ గనుక వన్డేల నుంచి కూడా తప్పుకొని హార్దిక్ కు పగ్గాలు దక్కితే అప్పుడు టెస్టులు (బుమ్రా), వన్డేలు (పాండ్యా), టి20లు (సూర్య కుమార్ యాదవ్)కు వేర్వేరు కెప్టెన్లు అవుతారు. గతంలో ఇలా ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. వన్డేలు, టి20లకు ఒకరు, టెస్టులకు మరొకరు కెప్టెన్సీ చేశారు.