చాంపియన్స్ ట్రోఫీకి 15 మంది భారత జట్టు ఇదే.. మెరుపుల్లేవ్
గత ఆదివారంతోనే గడువు తీరినా.. బీసీసీఐ మాత్రం కొంత సమయం తీసుకుంది. వారం తర్వాత ఎట్టకేలకు శనివారం జట్టును వెల్లడించింది.
By: Tupaki Desk | 18 Jan 2025 10:00 AM GMTభారత జట్టు అసలు పాల్గొంటుందా..? లేదా..? అనే స్థితి నుంచి.. దుబాయ్ లో తటస్థ వేదిక మీద మ్యాచ్ లు జరిగేదాకా వచ్చింది చాంపియన్స్ ట్రోఫీ. వచ్చే నెల 19 నుంచి జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే అన్ని జట్లూ 15 మంది సభ్యులను ప్రకటించాయి. గత ఆదివారంతోనే గడువు తీరినా.. బీసీసీఐ మాత్రం కొంత సమయం తీసుకుంది. వారం తర్వాత ఎట్టకేలకు శనివారం జట్టును వెల్లడించింది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్ లు ఓడినా, బ్యాట్స్ మన్, కెప్టెన్ గా ఘోర వైఫల్యం ఎదుర్కొన్నా.. టీమ్ ఇండియాను చాంపియన్స్ ట్రోఫీలో నడిపించే బాధ్యతను స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకే అప్పగించారు. రోహిత్ తో పాటు మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్ పైనా నీలినీడలు కమ్ముకున్నా.. వీరిద్దరి ఎంపికలో దానిని పరిగణనలోకి తీసుకోలేదు.
భవిష్యత్ లో టెస్టు కెప్టెన్ గా భావిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. రెండేళ్లుగా టెస్టులు, టి20ల్లో అదరగొడుతున్న అతడు ఇంతవరకు వన్డేలు ఆడలేదు.
ఏడాది కిందటి వరకు ఆశాకిరణంగా కనిపించినా.. వైఫల్యాలతో వెనుకబడిన శుబ్ మన్ గిల్ ను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడమే కాక వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. గత ఏడాది జింబాబ్వేతో టి20లకు కెప్టెన్సీ, శ్రీలంకతో టి20 సిరీస్ లో వైస్ కెప్టెన్సీ చేసిన గిల్ ను వచ్చే ఇంగ్లండ్ తో టి20లకు అసలు ఎంపిక చేయని సంగతి గమనార్హం. మళ్లీ ఇంతలోనే అతడిని వన్డే ఫార్మాట్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్ గా ప్రకటించడం ఆశ్చర్యం.
టి20ల్లో సెంచరీలు మీద సెంచరీలు, చివరగా ఆడిన వన్డేలో సెంచరీ కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను చాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ లకు చోటిచ్చారు.గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలను ఎంపిక చేశారు.నిరుడు వన్డే ప్రపంచ కప్ అనంతరం బీసీసీఐని ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ అవకాశం దక్కింది. తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు.స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తో పాటు టి20 స్పెషలిస్ట్ పేసర్ అర్షదీప్ సింగ్ కూ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో బెర్తు దక్కింది.