టీమ్ ఇండియా.. ఒక్క గెలుపు.. 3 ఓటములకు జవాబు.. 3 పాయింట్లు
ఆస్ట్రేలియా పర్యటన అంటే మామూలు మాటలు కాదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లనే ఆస్ట్రేలియా బెంబేలెత్తించింది.
By: Tupaki Desk | 25 Nov 2024 9:59 AM GMTసరిగ్గా మూడు వారాల కిందట టీమ్ ఇండియా పరిస్థితి అత్యంత దారుణం.. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ కు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ను కోల్పోయింది.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిరీస్ ను కూడా కోల్పోయింది. మరెప్పుడూ జరగని తీరున 0-3తో క్లీన్ స్వీప్ కూడా అయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాల పని అయిపోయిందంటూ ఒకటే విమర్శలు.. వారందరికీ చివరి సిరీస్ ఆస్ట్రేలియా పర్యటనే అని ఊహాగానాలు.. కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికలపై దాడి.. కానీ, పడినచోట పైకి లేవడం విజేతల లక్షణం. ఇప్పుడు కంగారూ గడ్డపై భారత్ అదే పని చేసింది.
ఓడకుంటే చాలు అనుకుంటే..
ఆస్ట్రేలియా పర్యటన అంటే మామూలు మాటలు కాదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లనే ఆస్ట్రేలియా బెంబేలెత్తించింది. అలాంటిది న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో మూడుకు మూడు టెస్టుల్లో ఓడిపోయిన టీమ్ ఇండియా ఏం చేస్తుంది..? చేతులెత్తేయడం ఖాయం అని అనుకున్నారు. దీనికితోడు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో, యువ బ్యాట్స్ మన్ శుబ్ మన్ గిల్ వేలి గాయంతో జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ టెస్టు మ్యాచ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కనీసం ఓడిపోకుండా మ్యాచ్ డ్రా చేసుకుంటే చాలని భావించారు. కానీ, ఏకంగా విజయమే సాధించింది. ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టును టీమ్ ఇండియా గెలుచుకుంది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 295 పరుగుల అతి భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూ గడ్డపై భారత్ కిదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
పాయింట్ల పట్టికలో పైకి..
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను భారత్ మెరుగుపర్చుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమితో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. అయితే, పెర్త్ లో గెలుపుతో మళ్లీ పైకి వచ్చింది. ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది. భారత్ విజయాల శాతం 61.11 శాతం కాగా 98 పాయింట్లు ఖాతాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 57.69 విజయాల శాతంతో ఉంది. పెర్త్ టెస్టు ముందు వరకు ఆస్ట్రేలియా (62.50 శాతం), భారత్ (58.33 శాతం) మొదటి, రెండు స్థానాల్లో ఉండేవి. శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55) దక్షిణాఫ్రికా (54.17) తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, జూన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో సిరీస్ దక్కించుకోవాల్సి ఉంది.