0-3.. టీమ్ ఇండియాకు చరిత్రలో ఎరుగని ఘోర పరాభవం
147 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన టీమ్ ఇండియా 121 పరుగులకే ఆలౌటైంది. కాగా, 3 లేదా అంతకుమించిన టెస్టుల సిరీస్ లో భారత్ వైట్ వాష్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
By: Tupaki Desk | 3 Nov 2024 8:12 AM GMTటీమ్ ఇండియాకు ఇంతకంటే దారుణ పరాభవం ఉండదేమో... స్వదేశంలో ఇంతకంటే దారుణ ఓటమి ఉండదేమో..? టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్.. అంతకుమించిన టాప్ బౌలర్లు.. కానీ, సొంతగడ్డపై వైట్ వాష్.. కలలో కూడా ఊహించని ఫలితం.. 0-3.. సగటు అభిమాని కూడా తట్టుకోలేని వైఫల్యం.. ఆడుతున్నది భారత జట్టేనా..? ఓడుతున్నది మనవాళ్లేనా..? స్పిన్ ను నమిలి అవతల పారేసే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైశ్వాల్, శుబ్ మన్ గిల్.. కనీసం 150 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేకోవడమా..?
చరిత్రలో తొలిసారి...
అంతా అనుకున్నట్లే అయింది. న్యూజిలాండ్ చేతిలో భారత్ 0-3తో మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ అంతా ఫెయిలవడంతో మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3-0తో న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. 147 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన టీమ్ ఇండియా 121 పరుగులకే ఆలౌటైంది. కాగా, 3 లేదా అంతకుమించిన టెస్టుల సిరీస్ లో భారత్ వైట్ వాష్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
25 ఏళ్ల తర్వాత
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడిన 2000 సంవత్సరంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత్ 0-2తో ఓడిపోయింది. అంటే.. స్వదేశంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా సిరీస్ ఓడిపోయింది. కాగా, ఈ సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించి రెండు టెస్టుల్లోనూ దారుణంగా ఓడింది. అదే సమయంలో భారత్ జట్టు బంగ్లాదేశ్ పై 2-0తో ఘన విజయం సాధించింది. కానీ, ఇపుడు అదే న్యూజిలాండ్ మన స్పిన్ పిచ్ లపైనే మనల్ని మట్టికరిపించింది. భారత్ స్పిన్నర్లతో పోలిస్తే సాధారణ స్పిన్నర్లయిన అజాజ్ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్ (3/42)లు మూడో టెస్టులో దెబ్బకొట్టారు. అజాజ్ తొలి ఇన్నింగ్స్ లోనూ ఐదు వికెట్లు తీయడం గమనార్హం. పంత్ (64) ఆడకుంటే భారత్ మరింత దారుణంగా ఓడిపోయేదే. ముంబైలో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235, రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 121కే పరిమితమైంది.