Begin typing your search above and press return to search.

చరిత్రలో తొలి.. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి

భారత్ లో టెస్టు సిరీస్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే మానసికంగా ఓటమికి సిద్ధం అయిపోయేవి..

By:  Tupaki Desk   |   26 Oct 2024 11:06 AM GMT
చరిత్రలో తొలి.. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి
X

భారత్ లో టెస్టు సిరీస్ అంటే ప్రత్యర్థి జట్లు ముందే మానసికంగా ఓటమికి సిద్ధం అయిపోయేవి.. ఆస్ట్రేలియా నుంచి బంగ్లాదేశ్ వరకు ఎవరిదైనా ఇదే పరిస్థితి.. స్పిన్ తిరిగే పిచ్ లు.. చెలరేగి ఆడే బ్యాట్స్ మెన్లు.. దీంతో ప్రత్యర్థి జట్లకు భారత్ లో సిరీస్ అంటేనే భయం పుట్టేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు అప్పుడప్పుడు మాత్రమే సిరీస్ లు గెలిచేవి. అది కూడా కాస్త లక్ కలిసొస్తేనే.. కానీ సేన దేశాల (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లలో ఇప్పటివరకు న్యూజిలాండ్ మాత్రం భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఎన్నోసార్లు పర్యటించిన ఆ జట్టు కనీసం టెస్టులు కూడా గెలవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ సారి సిరీస్ నే కొట్టేసింది..

సరిగ్గా 20 రోజుల కిందట భారత ఉప ఖండంలోని శ్రీలంకతో టెస్టు సిరీస్ లో రెండు మ్యాచ్ లనూ ఘోరంగా ఓడిపోయింది న్యూజిలాండ్. వారి స్టార్ బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ కూడా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లోకి అడుగుపెట్టి రెండు టెస్టులను వరుసగా గెలిచింది న్యూజిలాండ్. మొత్తంమీద భారత గడ్డపై వారికిది నాలుగో టెస్టు గెలుపు మాత్రమే. ఇందులో రెండు ఈ సిరీస్ లోనివే కావడం గమనార్హం. 1988 తర్వాత భారత్ లో టెస్టు గెలవడం (బెంగళూరులో జరిగిన తొలి టెస్టు)కివీస్ కు తొలిసారి.

టీమ్ ఇండియా కొమ్ములు విరిచింది

భారత్ లో భారత్ ను ఓడించడం ఇటీవలి కాలంలో ఏ జట్టుకూ సాధ్యం కాలేదు. కానీ, న్యూజిలాండ్ మాత్రం సాధ్యం చేసింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టును పేస్ బౌలర్ల హవాతో గెలిచిన న్యూజిలాండ్.. పుణెలో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల టార్గెట్ కు గాను.. భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77) మాత్రమే రాణించాడు. మిగతావారంతా చేతులెత్తేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ లో ఏడు వికెట్లతో చెలరేగిన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. రెండో ఇన్నింగ్స్‌ లో ఆరు వికెట్లు తీశాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను కివీస్ 2-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. రెండు జట్ల మధ్య మూడో టెస్టు నవంబరు 1 నుంచి ముంబైలో జరుగుతుంది.

2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌ లు నెగ్గింది టీమ్‌ఇండియా. 2012లో భారత్ చివరిసారిగా ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడింది.